- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ స్థాయి నిపుణుల అనుమతుల మేరకే ప్రాజెక్టు పున నిర్మాణ పనులు
వచ్చే వేసవి నాటికి అన్ని ప్రాజెక్టుల పనులను పూర్తిచేసి రాష్ట్రం లో సాగునీరు, త్రాగునీరు సమస్య పరిస్కరిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : బిఆర్ఎస్ హయాంలో నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల పుననిర్మాణ పనులను కేంద్ర జల నిపుణుల కమిటీ సూచించిన మేరకు పనులు చేపడతామని, వచ్చే వేసవి నాటికి అన్ని ప్రాజెక్టుల పనులను పూర్తిచేసి రాష్ట్రం లో సాగునీరు, త్రాగునీరు సమస్య పరిస్కరిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పటికే నిపుణులతో కమిటీ వేసి పూర్తి నివేదిక తెప్పించామని, ఎంత ఖర్చయినా ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. సోమవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి జిల్లాలోని కన్నాయిగూడెం మండలం గుట్టల గంగారం వద్ద నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు ను పరిశీలించారు. హైదరాబాద్ నుండి నేరుగా దేవాదులు చేరుకున్న మంత్రులు సమ్మక్క సారక్క బ్యారేజీని పరిశీలించిన అనంతరం దేవాదుల ప్రాజెక్టు వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలను సంబధిత అధికారులు మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్టంలో నీటి సమస్య తీర్చడానికి ముందస్తు ప్రణాళికతో నిర్ణయాలు తీసుకుంటున్నామని, దేవాదుల వద్ద ఏర్పాటు చేసిన 10 పంపుల ద్వారా 12 జిల్లాల్లోని 17 శాసన సభ కేంద్రాలకు నీటిని తరలిస్తామని తెలిపారు.
దేవాదులకు సంబంధించిన 194 కోట్ల పెండింగ్ బిల్లులు ఇప్పటికే విడుదల చేశామని, బిఆర్ఎస్ హయంలో నాసిరకంగా ప్రాజెక్టుల నిర్మాణ పనులు చేపట్టిన కారణంగానే మీరు పనికి రాకుండా పోయాయని తెలిపారు. లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన భారీ ప్రాజెక్టు నిర్మాణ పనులను సెంట్రల్ సేఫ్టీ అధికారులు పరిశీలించి నివేదిక సమర్పించారని, వారు నిర్మించిన ప్రాజెక్టుల వద్ద గోదావరి జిల్లాలో చేస్తే 44 గ్రామాలు నీటిన మునిగిపోయే అవకాశం ఉందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భారీ ప్రాజెక్టులు నేటికీ కట్టుదిట్టంగా ఉన్నాయని, కమిషన్ల కోసం బిఆర్ఎస్ నాయకులు నిర్మించిన ప్రాజెక్టు కూలిపోతున్నాయని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆ పార్టీ నాయకులు అనేక ఆరోపణ చేస్తున్నారని, రానున్న రోజుల్లో జల యజ్ఞం పేరుతో ఎన్ని కోట్లు ఖర్చయినా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సొమ్మును దిగమింగిన ఆ పార్టీ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు వద్ద పది మోటర్లను ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఏడు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారని, దీని ద్వారా 38.16 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా 6 లక్షల 14వేల 750 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని, 664 కిలోమీటర్ల వరకు 21 లిఫ్టుల ద్వారా పంపిణీ చేస్తున్నామని వివరించారు.
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే నిర్మించగా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పిల్లర్లు దెబ్బతిన్నాయని దీంతో ఆ ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. కూలిపోయిన ప్రాజెక్టుల ద్వారా చుక్క నీరు రాకపోయినా రికార్డు స్థాయిలో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి రైతులకు 80 వేల కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎస్సారెస్పీ, నిజాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం చెక్కుచెదరకుండా ఉన్నాయని, కమీషన్లు కక్కుర్తి పడి బిఆర్ఎస్ నాయకులు నిర్మించిన ప్రాజెక్టులు కూలిపోయాయని, దీంతో ప్రజాధనం వృధా అయిందని వివరించారు. 10 సంవత్సరాల కాలంలో ఆ పార్టీ నాయకులు 1.81 లక్షల కోట్లు ఇరిగేషన్ పై ఖర్చు చేశారని ఖర్చు చేసిన నిధులు గోదావరిలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిజాన్ని అబద్ధం గా అబద్ధాన్ని నిజంగా చెప్పడంలో బిఆర్ఎస్ నాయకులు ముందంజలో ఉన్నారని శకునిమామ మాటలు విని అబద్ధాల రావు, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీపై రోజుకు ఆరోపణ చేయడం సిగ్గుచేటని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ఎంత ఖర్చయినా మినకంజు వేసే ప్రసక్తే లేదని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు, యశస్వని రెడ్డి, జిల్లా కలెక్టర్ బోర్కేడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డిఎఫ్ఓ వికాస్ మీనా, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టొప్పో , కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






