నార్కట్‌పల్లి బస్టాండ్‌లో సమస్యల తిష్ట

by Jakkula.Mamatha |

నిజాం కాలం నాటి పురాతన చరిత్ర కలిగిన నార్కట్‌పల్లి బస్ డిపో, బస్టాండ్ నేడు సమస్యలకు నిలయంగా మారింది.

నార్కట్‌పల్లి బస్టాండ్‌లో సమస్యల తిష్ట
X

నిజాంకాలం నాటి నార్కట్‌పల్లి బస్టాండ్ కనీస వసతులు లేక సమస్యల నిలయంగా మారింది. నిత్యం వేలాదిమంది రెండు రాష్ట్రాల ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండ్‌ను అధికారులు పట్టించుకోవడం లేదు. తాగునీటి కుళాయిలున్నా నీరు రాకపోవడంతో ప్రయాణికులు కొనుగోలు చేసి తాగక తప్పడం లేదు. శుభ్రత లేక మరుగుదొడ్లు కంపు కొడుతుండడంతో దుర్వాసనతో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. ఫ్యాన్లు తిరగక, కూర్చోవడానికి కుర్చీలు లేక విద్యార్థులు, చెరువుగట్టు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

దిశ, నార్కట్‌పల్లి: నిజాం కాలం నాటి పురాతన చరిత్ర కలిగిన నార్కట్‌పల్లి బస్ డిపో, బస్టాండ్ నేడు సమస్యలకు నిలయంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు అత్యంత కీలకమైన ఈ బస్టాండ్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. హైదరాబాద్, సూర్యాపేట, కోదాడ, ఖమ్మం, మధిర, నల్గొండ, మిర్యాలగూడ, యాదగిరిగుట్ట, భువనగిరి, మోత్కూరు తదితర ప్రాంతాలకు బస్సులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు తీవ్రంగా విఫలమవుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాగునీటికి తిప్పలు.. కంపు కొడుతున్న మరుగుదొడ్లు..

బస్టాండ్ ఆవరణలో మంచినీటి కుళాయిలు అమర్చినప్పటికీ నీటిని సరఫరా చేయడం లేదు. ప్రైవేట్ సంస్థ ‘దివిస్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాన్ని కూడా వినియోగంలోకి తేకపోవడంతో ప్రయాణికులు అధిక ధరలు పెట్టి నీళ్ల బాటిళ్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది. మరోవైపు మరుగుదొడ్లను శుభ్రం చేసేవారు లేక తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయి. రాత్రివేళల్లో కొందరు బస్టాండ్ ప్రాంగణంలోనే మలమూత్ర విసర్జన చేస్తుండడంతో ప్రయాణికులు నిమిషం కూడా అక్కడ నిలబడలేని పరిస్థితి దాపురించింది. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.

చాలని కుర్చీలు – తిరగని ఫ్యాన్లు..

బస్టాండ్‌లోని ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేకపోవడంతో వేలాదిమంది గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. రోజూ ఉదయాన్నే వచ్చే విద్యార్థులు, సాధారణ ప్రయాణికులతోపాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెరువుగట్టుకు అమావాస్య రోజుల్లో వచ్చే వేలాది మంది భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఆదాయం ఉన్నా నిర్లక్ష్యం..

నార్కట్‌పల్లి పట్టణ కేంద్రంలో డిపోకు విశాలమైన స్థలం ఉంది. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఆర్టీసీకి నెలకు రూ.లక్షల ఆదాయం సమకూరుతుంది. కానీ అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏళ్ల తరబడి వినతులు ఇస్తున్న పట్టించుకోకపోవడం పై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, చారిత్రక నార్కట్‌పల్లి బస్టాండ్‌ను అభివృద్ధి చేయడంతోపాటు కనీస సదుపాయాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Next Story