డ్రగ్స్ మత్తులో ఉన్మాదం.. పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు!

by Jakkula.Mamatha |

డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో పట్టుకునేందుకు వచ్చిన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులపైకి ఓ యువకుడు కారు ఎక్కించిన సంఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

డ్రగ్స్ మత్తులో ఉన్మాదం.. పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు!
X

దిశ, కార్వాన్: డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో పట్టుకునేందుకు వచ్చిన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులపైకి ఓ యువకుడు కారు ఎక్కించిన సంఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ కాలు ఫ్రాక్చర్ కాగా ఇన్‌స్పెక్టర్‌కు గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం అబిడ్స్ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయని హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌కు సమాచారం అందింది. దీంతో ఆయన ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా, హెచ్-న్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ తమ సిబ్బందితో కలిసి అబిడ్స్ పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేశారు. అబిడ్స్‌లోని పాయల్ ఫుట్‌వేర్ వద్దకు నీలిరంగు బలెనో కారు రాగానే, ఓ వ్యక్తి కారులో ఉన్న వారికి ఒక డ్రగ్స్ ప్యాకెట్‌ను అందించాడు.

గమనించిన పోలీసులు వెంటనే ప్యాకెట్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న హుస్సేనీ ఆలమ్‌కు చెందిన సైఫ్‌కు పోలీసులు తమ ఐడీ కార్డులు చూపించి బయటకు రావాలని సూచించారు. అయితే కారును పక్కకు తీస్తున్నట్లు నటించిన సైఫ్ ఒక్కసారిగా కారును రివర్స్ చేసి తప్పించుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలుపై నుంచి కారును పోనిచ్చాడు.

అనంతరం కారుతో వేగంగా పారిపోతుండగా, ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ బృందం అతడిని వెంటాడి అఫ్జల్‌గంజ్ వద్ద అడ్డుకుంది. ఈ ప్రక్రియలో ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. కారు కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌ను వెంటనే సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన కాలు ఫ్రాక్చర్ అయినట్లు తెలిపారు. బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు నిందితుడు సైఫ్‌పై అబిడ్స్, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న హెచ్-న్యూ పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story