- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో డేటా లీక్.. ఆన్‌లైన్‌లో విక్రయానికి 1 టీబీ డేటా
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన 'బ్యాంక్ ఆఫ్ బరోడా' (Bank of Baroda) సిస్టమ్స్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు వార్తలు రావడం సంచలనం సృష్టిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన 'బ్యాంక్ ఆఫ్ బరోడా' (Bank of Baroda) సిస్టమ్స్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు వార్తలు రావడం సంచలనం సృష్టిస్తోంది. బ్యాంక్‌కు చెందిన దాదాపు 1 టెరాబైట్ (1TB) సున్నితమైన డేటాను హ్యాకర్లు చోరీ చేసి, డార్క్ వెబ్‌లో ఉచితంగా ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ డేటాలో ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం, ఆధార్ వివరాలు, లోన్ రికార్డులు, కార్పొరేట్ బ్యాంకింగ్ వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.
డార్క్ వెబ్‌లో శాంపిల్ పత్రాలు ప్రత్యక్షం
హ్యాకింగ్ సైట్ నుంచి సేకరించిన కొన్ని శాంపిల్ డాక్యుమెంట్లను 'క్యాష్‌లెస్ కన్స్యూమర్' వ్యవస్థాపకుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ లక్ష్మణన్ 'X' (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. శనివారం (జులై 25) డార్క్ వెబ్ ట్రాకింగ్ సైట్ ransomeware.live ద్వారా ఈ డేటా లీక్ వెలుగులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
"ప్రాథమిక పరిశీలనలో బ్యాంకుకు చెందిన అంతర్గత పత్రాలు లీక్ అయినట్లు స్పష్టమవుతోంది. బ్రాంచ్ ఆడిట్ నివేదికలు, లోన్ ప్రాసెసింగ్ వివరాలు, అంతర్గత కమ్యూనికేషన్లు, విజిలెన్స్ విచారణ పత్రాలు, bobWorld ఆడిట్ రిపోర్టులతో పాటు దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచ్‌ల ఖాతాదారుల అప్లికేషన్ ఫారాలు ఇందులో ఉన్నాయి. ఇది తీవ్రమైన సైబర్ విపత్తు" అని శ్రీకాంత్ పేర్కొన్నారు. సేవింగ్స్, కరెంట్ ఖాతాదారుల వివరాలు, నెట్ బ్యాంకింగ్ యూజర్ సమాచారం, అప్పుల వివరాలు, అప్రైజల్ డాక్యుమెంట్లు, ఎన్ఆర్ఐ (NRI), కార్పొరేట్ బ్యాంకింగ్ రికార్డులు, బ్రాంచ్‌లు, ఏటీఎంలకు సంబంధించిన అంతర్గత సమాచారం ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.
హ్యాకింగ్ వెనుక ఉన్నది ఎవరు?
ఈ దాడికి ప్రత్యక్షంగా ఏ గ్రూప్ బాధ్యత వహించనప్పటికీ, "TripleX" అనే కొత్త హ్యాకర్ల బృందం దీని వెనుక ఉండి ఉండవచ్చని శ్రీకాంత్ అనుమానం వ్యక్తం చేశారు. ఇదే TripleX గ్రూప్ గత మే నెలలో ఇండోనేషియాకు చెందిన ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు 'PT Bank Negara Indonesia'పై దాడి చేసి 2TB డేటాను చోరీ చేసినట్లు సమాచారం. ఈ డేటా లీక్ కథనాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా యాజమాన్యం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సైబర్ సెక్యూరిటీ సంస్థ CERT-In లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి కూడా స్పష్టత రావాల్సి ఉంది. కాగా.. గతంలో సెప్టెంబర్ 2025లో 'UpGuard' అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఓ థర్డ్-పార్టీ క్లౌడ్ డేటాబేస్ ద్వారా 2.73 లక్షల బ్యాంకింగ్ రికార్డులు లీక్ అయ్యాయని, అందులో 6,000 బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందినవని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇటీవల AI మోడళ్ల వల్ల పెరిగిన సైబర్ ముప్పు దృష్ట్యా ఆర్థిక సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి.






