నిరసన తెలిపినంత మాత్రాన లాఠీఛార్జ్ చేయకూడదు: సుప్రీంకోర్టు

by Prasad Jukanti |   (  Updated:2026-07-27 06:22:45  IST  )

ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనల్లో పోలీసులు లాఠీచార్జి చేయడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. శాంతియుత నిరసనలు రాజ్యాంగబద్ధమైన హక్కు అని స్పష్టం చేసింది.

నిరసన తెలిపినంత మాత్రాన లాఠీఛార్జ్ చేయకూడదు: సుప్రీంకోర్టు
X
దిశ, డైనమిక్ బ్యూరో: శాంతియుత నిరసన వ్యక్తం చేయడం ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ఆందోళన జరుగుతోందనే కారణంతో లాఠీచార్జి చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని తెలిపింది. నిరసనల నియంత్రణలో చట్టబద్ధ విధానాలనే అనుసరించాలని పేర్కొంది. నీట్ (NEET) పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా జులై 20న సీజేపీ నేతృత్వంలో విద్యార్థులు చేపట్టిన 'చలో సంసద్' మార్చ్‌పై పోలీసులు టియర్ గ్యాస్, లాఠీఛార్జ్ ప్రయోగించడంపై దాఖలైన పలు పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చితో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ఆందోళనలను సాకుగా చూపి పోలీసుల మితిమీరిన బలప్రయోగం సమర్థిచలేమని తెలిపింది.

పోలీసుల జీవితమూ విలువైనదే:

ఇదే సమయంలో పోలీసుల భద్రతను కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయరాదని, ఆందోళనల్లో ఆకతాయిలు ప్రవేశించి పోలీసులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళనకరం అని పేర్కొంది. పోలీసుల జీవితమూ విలువైనదేనని, పోలీసుల చర్యలతో పాటు, నిరసనకారుల హింసపై కూడా నిష్పక్షపాత దర్యాపు ఉండాలని స్పష్టం చేసింది. శాంతియుత నిరసనలు, పోలీసుల చర్యలపై దేశమంతటా ఏకరూప మార్గదర్శకాలు అవసరమని పేర్కొంది. ఈ అంశంలో దాఖలైన అన్ని పిటిషన్లు ఒకేసారి విచారిస్తామని తెలిపింది.

పిటిషన్లలో ప్రధాన డిమాండ్లు:

జులై 20 నాటి ఘటనపై స్వతంత్ర కమిటీతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని అలాగే ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, పోలీసుల బాడీ కెమెరా రికార్డింగ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పోలీసుల చర్యల్లో గాయపడిన విద్యార్థులు, నిరసనకారులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని ఈ పిటిషనర్లు కోరారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్లపై స్పందించిన సర్వోన్నత న్యాయత స్థానం పై విధంగా స్పందిస్తూ రేపు అన్ని పిటిషన్లు ఒకేసారి విచారిస్తామని తెలిపింది.

Next Story