నా కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడు తీసుకున్న ఆ నిర్ణయం ఒక పెద్ద సాహసమే: నిహారిక

by Mallepaka Hamsa |

మూడేళ్ల క్రితమే నేను కంటెంట్ చేయడం ఆపేశాను.

నా కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడు తీసుకున్న ఆ నిర్ణయం ఒక పెద్ద సాహసమే: నిహారిక
X

దిశ, సినిమా: సోషల్ మీడియా స్టార్ నిహారిక ఎన్ఎమ్, ఇప్పుడు వెండితెరపై సత్తా చాటుతున్నారు. టాలీవుడ్ సినిమాలతో నటిగా కొత్త ప్రయాణం ప్రారంభించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రాఘవ్ జుయల్‌తో కలిసి ఆమె నటించిన హిందీ చిత్రం ‘భాయ్ తేరా స్టార్ హై’ జూలై 31న థియేటర్లలోకి రాబోతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో రష్మి అనే చలాకీ పాత్రలో కనిపిస్తున్నానని, దర్శకుడు వివేక్ అగర్వాల్ తగిన ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. అలాగే కో-స్టార్ రాఘవ్ జుయల్‌పై ప్రశంసలు కురిపించారు. షూటింగ్ సమయంలో తామిద్దరం ఎలాంటి స్క్రిప్ట్ లేకుండానే ఓ సీన్‌లో ఓన్ ఎనర్జీతో నటించామని, అది చాలా బాగా వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఇందులో ఎంతోమంది నటులతో కలిసి పనిచేయడం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నానని చెప్పారు.

అలాగే సోషల్ మీడియాలో మంచి సంపాదన, క్రేజ్ వస్తున్న సమయంలోనే కంటెంట్ క్రియేషన్‌ను ఆపేయడం పెద్ద రిస్క్ అని నిహారిక చెప్పారు. "మూడేళ్ల క్రితమే నేను కంటెంట్ చేయడం ఆపేశాను. ఎంతో డబ్బు, గుర్తింపు ఇచ్చే కెరీర్‌ను వదిలేయడం భయంగా అనిపించినా.. నాలో నటిని నిరూపించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడు తీసుకున్న ఆ నిర్ణయం ఒక పెద్ద సాహసమే అయినప్పటికీ ఏదైనా తేడా జరిగినా మళ్లీ మొదటి నుంచి నన్ను నేను నిర్మించుకోగలననే నమ్మకం నాకుంది" అని ఆమె తెలిపారు. మామూలుగా సౌత్ సినిమాల్లో మహేష్ బాబును చూసినప్పుడు హీరోయిన్‌గా నటించాలని ఉండేదని, కానీ తన రంగు కారణంగా మొదట్లో కాస్త సంకోచించానని తెలిపారు. అయితే ఇప్పుడు పరిశ్రమలో రంగు, రూపాంతరాలతో సంబంధం లేకుండా అందరినీ ఆదరిస్తుండటం శుభపరిణామం అని సంతోషం వ్యక్తం చేశారు. దక్షిణాది ప్రేక్షకులు తనను పక్కింటి అమ్మాయిలా ఆదరిస్తున్నారని, వారి ప్రేమే తనను ముందడుగు వేసేలా చేస్తోందని నిహారిక పేర్కొన్నారు.

Next Story