బీమా ఫేస్-2 పంప్ ప్రారంభించిన డీఈ వెంకటరమణ

by Jakkula.Mamatha |

కృష్ణా నదికి వరద ప్రవాహం పెరగడంతో బీమా ఫేస్-2 పంప్‌ను సోమవారం ఉదయం 7:30 గంటలకు డీఈ వెంకటరమణ ప్రారంభించారు.

బీమా ఫేస్-2 పంప్ ప్రారంభించిన డీఈ వెంకటరమణ
X

దిశ, మక్తల్: కృష్ణా నదికి వరద ప్రవాహం పెరగడంతో బీమా ఫేస్-2 పంప్‌ను సోమవారం ఉదయం 7:30 గంటలకు డీఈ వెంకటరమణ ప్రారంభించారు. పంప్ ద్వారా 4 క్యూసెక్కుల నీటిని సంగంబండ రిజర్వాయర్ కాల్వకు విడుదల చేశారు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో శనివారం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా కూడా నీటిని దిగువకు వదులుతుండటంతో ఎగువ కృష్ణా వరద ప్రవాహం ఆదివారం నాటికి తెలంగాణకు చేరుకుంది. దీనివల్ల జూరాల బ్యాక్ వాటర్ పెరిగి, కృష్ణా నది ఒడ్డున ఉన్న వల్లభాపురంలోని దత్తాత్రేయ స్వామి పుష్కర ఘాట్లు వరద నీటిలో మునిగిపోయాయి.

జూరాల బ్యాక్ వాటర్ పెరగడంతో గోపాల్‌పూర్ బీమా ఫేస్-1 పంప్ బావిలోకి నీరు చేరింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిఈ వెంకటరమణ గోపాల్‌పూర్ వద్ద ఫేస్-1 పంప్‌ను ప్రారంభించి కాల్వకు 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో 250 క్యూసెక్కుల నీరు భూత్పూర్ రిజర్వాయర్‌కు వెళ్లగా, మిగిలిన 400 క్యూసెక్కుల నీరు ఖానాపూర్ దగ్గర ఉన్న పంప్ హౌస్‌కు చేరుకుంటోంది. ఖానాపూర్ పంప్ హౌస్ పూర్తి స్థాయిలో సిద్ధం కావడంతో, డీఈ వెంకటరమణ మరియు ఇతర అధికారులు బీమా ఫేస్-2 మోటార్లను ప్రారంభించి నీటిని ముందుకు పంపారు.

Next Story