బల్దియాలో మంచి నీటి వృథా.. పట్టించుకోని అధికారులు

by Jakkula.Mamatha |

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలోనే నీరు వృథాగా పోవడం విమర్శలకు తావిస్తోంది.

బల్దియాలో మంచి నీటి వృథా.. పట్టించుకోని అధికారులు
X

దిశ, వరంగల్ టౌన్: మంచి నీటిని ప్రతి చుక్కా పొదుపు చేయాలని ప్రభుత్వాలు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వేళ.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలోనే నీరు వృథాగా పోవడం విమర్శలకు తావిస్తోంది. సోమవారం నిర్వహించిన ప్రజావాణి గ్రీవెన్స్ కార్యక్రమం సమయంలో కార్యాలయ ఆవరణలోని గ్రౌండ్ వాటర్ ట్యాంక్ నిండిపోవడంతో గంటల తరబడి నీరు ఓవర్‌ఫ్లో అవుతూ వృథాగా పారింది. కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఈ దృశ్యాన్ని గమనించి అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాంక్ నుంచి నీరు నిరంతరం బయటకు వస్తున్నా, దానిని నిలిపివేసేందుకు లేదా సమస్యను పరిష్కరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని పలువురు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలపై హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో, మంచినీటిని అత్యంత పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్న వేళ మున్సిపల్ కార్యాలయంలోనే ఈ తరహా నిర్లక్ష్యం చోటుచేసుకోవడం పై ప్రజలు మండిపడ్డారు. బాల్దియాలోనే నీటిని కాపాడలేని అధికారులు నగరంలోని తాగునీటి లీకేజీలు, పైప్‌లైన్ సమస్యలపై ఎలా స్పందిస్తారు అంటూ గ్రీవెన్స్‌కు వచ్చిన పలువురు ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story