- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డేంజర్ జర్నీలో చిన్నారులు.. పట్టించుకోని అధికారులు!
పాఠశాల చిన్నారుల రవాణాలో నిబంధనలు గాలికొదిలేస్తున్నారు.

దిశ, ఝరాసంగం: పాఠశాల చిన్నారుల రవాణాలో నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. ఐదుగురు ప్రయాణించాల్సిన మారుతి వ్యాన్లలో ఏకంగా 10 నుంచి 15 మంది వరకు చిన్నారులను కుక్కి తరలిస్తున్నారు. మరికొందరు ఆటోలు, స్కూటీలపై పరిమితికి మించి చిన్నారులను తీసుకెళ్తూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాల్సిన ఆర్టీఏ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సోమవారం ఉదయం ‘దిశ’ ఝరాసంగం ప్రధాన రహదారులతో పాటు కుప్పానగర్, మాచునూర్ ప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల రవాణా వాహనాలను పరిశీలించింది. ఈ సందర్భంగా మారుతి వ్యాన్లు, ఆటోల్లో పరిమితికి మించి చిన్నారులను తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూటీలపై పాఠశాలలకు తీసుకెళ్తుండగా, మరికొన్ని వాహనాల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకుని ప్రయాణిస్తున్నట్లు కనిపించింది.
ఇదిలా ఉండగా.. ఝరాసంగం ఆదర్శ విద్యాలయం, ఝరాసంగం (మాచునూర్) కేంద్రీయ విద్యాలయంతో పాటు వివిధ గ్రామాల నుంచి జహీరాబాద్‌లోని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలలకు వెళ్లే వాహనాల్లోనూ అధిక సంఖ్యలో విద్యార్థులను తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల తరలించే వాహనాలను ప్రత్యేక తనిఖీలు నిర్వహించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే బదులు ముందుగానే అధికారులు అప్రమత్తమై చిన్నారుల ప్రాణాలకు భద్రత కల్పించాలని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
కఠిన చర్యలు తీసుకుంటాం: మహేశ్వరం వెంకటయ్య ఎంవీఐ, జహీరాబాద్
పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న వాహనాలపై స్థానిక పోలీసుల సహాయంతో తనిఖీలు నిర్వహిస్తాం. మోటారు వాహనాల చట్టం, సంబంధిత నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే వాహనాలను సీజ్ చేస్తాం. చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించం. పాఠశాల విద్యార్థులను తరలించే వాహనాల యజమానులు, డ్రైవర్లు తప్పనిసరిగా మోటారు వాహనాల చట్టం, భద్రతా నిబంధనలను పాటించాలి.






