ప్లే స్కూల్లో దారుణం.. పిల్లాడి ప్రైవేట్ పార్ట్ కాల్చేసిన టీచర్

by Naga Rani Yarlagadda |

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది.

ప్లే స్కూల్లో దారుణం.. పిల్లాడి ప్రైవేట్ పార్ట్ కాల్చేసిన టీచర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. స్థానిక సిరీన్ సోనీ ప్లే స్కూల్లో ఐదేళ్ల చిన్నారి దుస్తుల్లోనే మూత్ర విసర్జన చేశాడనే కోపంతో ఒక టీచర్ అత్యంత అమానుషంగా ప్రవర్తించింది. జులై 24న సదరు విద్యార్థి వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు అనుమతి కోరగా టీచర్ నిరాకరించారు. దీంతో మూత్రం ఆపుకోలేక ఆ చిన్నారి ప్యాంట్‌లోనే మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ టీచర్ బాలుడిని వేరొక గదిలోకి తీసుకెళ్లి, గ్యాస్ స్టవ్ వెలిగించి కత్తిని బాగా కాల్చి ఆ చిన్నారి మర్మంగాలపై వాతలు పెట్టింది. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని భయపెట్టి, బాలుడిపై దాడికి కూడా పాల్పడినట్లు బాధితుడి తండ్రి ఫిర్యాదు చేశారు.

తీవ్ర భయాందోళనకు గురైన ఆ చిన్నారి ఇంటికి తిరిగొచ్చి జరిగిన ఘోరాన్ని కన్నీళ్లతో తల్లిదండ్రులకు వివరించాడు. ఆందోళన చెందిన బాధితుడి తల్లిదండ్రులు టీచర్ కు ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ హేమలతా సింగ్‌తో పాటు మేనేజర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరగా, వారు సహాయం చేయడానికి నిరాకరిస్తూ బాధితుడి కుటుంబంపైనే బెదిరింపులకు దిగారు. దీంతో న్యాయవాది అయిన ఆ చిన్నారి తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి అతుల్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై త్వరలోనే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Next Story