వాళ్లకు లేని వివరణలు.. నన్నెందుకు అడుగుతున్నారు : బోండా ఉమ అసహనం

by Naga Rani Yarlagadda |

ఇటీవల తన పర్యటనపై చెలరేగిన వివాదంపై విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

వాళ్లకు లేని వివరణలు.. నన్నెందుకు అడుగుతున్నారు : బోండా ఉమ అసహనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల తన పర్యటనపై చెలరేగిన వివాదంపై విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పార్టీ అధిష్ఠానం తనను ఏ రకమైన వివరణ అడగలేదని, ఒకవేళ అడిగితే కచ్చితంగా ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. తాను వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని, జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభకు మాత్రమే హాజరయ్యానని తెలిపారు. ఆ సమయంలో అక్కడ అంబటి రాంబాబు కనిపిస్తే మర్యాదపూర్వకంగా మాత్రమే పలకరించానని ఉమా క్లారిటీ ఇచ్చారు.

గతంలో వైసీపీ నేత జక్కంపూడి రాజా నిర్వహించిన సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా కూడా వెళ్లారని ఉమా ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ సభలో వాళ్లు బొత్స సత్యనారాయణ, జక్కంపూడి రాజా వంటి వైసీపీ నేతలతో మాట్లాడలేదా అని ప్రశ్నించారు. మరి వాళ్లను కూడా పార్టీ వివరణ అడుగుతుందా అని నిలదీసిన ఆయన, మిగతా నేతల విషయంలో లేని వివాదాలు, వివరణలు తన విషయంలోనే ఎందుకు వస్తున్నాయంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ టీడీపీకి ఇబ్బందులు కలిగించే పనులు చేయలేదని, సమయం వచ్చినప్పుడు ఈ అంశంపై పూర్తి వివరాలు వెల్లడిస్తానని బోండా ఉమా చెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కాపులు త్వరలోనే ఏకమవుతారని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

Next Story