- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ ఆస్పత్రిలో వ్యక్తి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రోగి మృతి చెందిన ఘటన అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

దిశ, హస్తినాపురం: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రోగి మృతి చెందిన ఘటన అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కిడ్నీలో రాళ్ల సమస్యతో చికిత్స పొందుతున్న మహేశ్(34) చికిత్స పొందుతూ మృతి చెందడంతో, వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహేశ్ ఆరోగ్య పరిస్థితి బాగున్నప్పటికీ సకాలంలో సరైన వైద్యం అందించలేదని, అంతేకాక ఆయన మృతి చెందిన విషయాన్ని కూడా ఆలస్యంగా తెలియజేశారని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు, వెల్నెస్ ఆస్పత్రిలోని అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు కుర్చీలను విరగొట్టారు. అనంతరం ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆందోళనకారులను శాంతింపజేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఆస్పత్రి ఆవరణలో భద్రతను కూడా పెంచారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహేశ్ మృతికి గల అసలు కారణాలు ఏమిటి, వైద్యుల నిర్లక్ష్యం ఉందా లేదా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మహేష్ మృతిపై వెల్నెస్ హాస్పిటల్ మేనేజర్ అజయ్ గౌడ్‌ను వివరణ కోరగా అతను పల్మొనరి ఎంబోలిజంతో మరణించారు అని తెలిపారు. ఇంకా మిగతా వివరాలు తెలపడానికి నిరాకరించారు. ఈ మరణం పై రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ, ఆసుపత్రి పై వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.






