జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

by Malleboina Mahesh |

పెళ్లి ఊరేగింపు (బారాత్)లో పాల్గొనేందుకు స్కార్పియో వాహనంలో బిజ్నోర్‌కు వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: జాతీయ రహదారిపై ఎదురెదురుగా రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ వద్ద ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని ముస్తఫాబాద్‌కు చెందిన కొందరు యువకులు పెళ్లి ఊరేగింపు (బారాత్)లో పాల్గొనేందుకు స్కార్పియో వాహనంలో బిజ్నోర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై అదనపు ఎస్పీ (ASP) వినీత్ భట్నాగర్ మాట్లాడుతూ.. గఢ్ ప్రాంతంలో హైవే దాటుతున్న ఒక జంతువు హఠాత్తుగా వాహనానికి అడ్డుగా వచ్చిందని తెలిపారు.

దానిని తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, స్కార్పియో మొదట ఆ జంతువును ఢీకొని, ఆపై డివైడర్ దాటి అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో బిజ్నోర్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న మరో కారును ఎదురెదురుగా బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించి, సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించామని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని మీరట్‌కు తరలించారని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Next Story