- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరెంట్ కోతలకు కారణం ఎవరు?
ఆమనగల్ బ్లాక్ పరిధిలోని ఆమనగల్, తలకొండపల్లి, కడ్తాల్, మాడుగుల మండలాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితిపై రైతులు, ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దిశ, తలకొండపల్లి: ఆమనగల్ బ్లాక్ పరిధిలోని ఆమనగల్, తలకొండపల్లి, కడ్తాల్, మాడుగుల మండలాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితిపై రైతులు, ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తరచూ విద్యుత్ అంతరాయాలు, వ్యవసాయ అవసరాల సమయంలో సరఫరా లేకపోవడం, గ్రామాల్లోనూ కరెంటు కోతలు పెరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ శాఖలో కొందరు అధికారులు, సిబ్బంది ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో కొనసాగుతుండటమే సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం మారింది.. సిబ్బంది మారలేదు..
మరి కరెంటు సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? అనే ప్రశ్న రైతులు, ప్రజల మధ్య ప్రధాన చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ, ప్రస్తుతం కూడా అదే అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నప్పటికీ విద్యుత్ సరఫరా అంతరాయాలు ఎందుకు పెరుగుతున్నాయో ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
ఏళ్ల తరబడి ఒకే చోట విధులు.. పెరుగుతున్న అవినీతి ఆరోపణలు!
తలకొండపల్లి మండలంలోని చుక్కాపూర్, గట్టు ఇప్పలపల్లి, తలకొండపల్లి, చంద్రధన, పడకల్, వెల్జాల్ గ్రామాల్లో 6 విద్యుత్ ఉపకేంద్రాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న లైన్‌మెన్లు, జూనియర్ లైన్‌మెన్లు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, ఏఈతో పాటు ఇతర సిబ్బందిలో పలువురు 4 నుంచి 6 సంవత్సరాలకు పైగా ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలంగా ఒకే ప్రాంతంలో పనిచేయడం వల్ల స్థానిక పరిచయాలు పెరిగి, కొందరు సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే శాఖాపరమైన నియంత్రణ బలహీనపడటంతో పాటు అవినీతి, అక్రమాలకు అవకాశం ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీడీలు చెల్లించి నెలలు గడుస్తున్న రైతులకు నిరాశ?
వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులు ట్రాన్స్‌ఫార్మర్లు, కొత్త విద్యుత్ స్తంభాలు తదితర పనుల కోసం డీడీలు చెల్లించినప్పటికీ పనులు సకాలంలో పూర్తి కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 2024–25 సంవత్సరంలో డీడీలు చెల్లించిన కొందరు రైతుల పనులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండగా, ఇటీవల నూతనంగా డీడీలు చెల్లించిన వారికి మాత్రం పనులు వేగంగా జరుగుతున్నాయనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. డీడీలు చెల్లించిన తేదీ, పెండింగ్ వ్యవధిని పరిగణనలోకి తీసుకోకుండా పనులు ఎలా జరుగుతున్నాయి? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొందరు అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బందికి అనుకూలంగా వ్యవహరిస్తేనే ఫైళ్లు ముందుకు కదులుతున్నాయని, లేకపోతే పనులు నిలిపివేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ అంశంపై ఉన్నతాధికారులు ఇప్పటికైనా సమగ్ర విచారణ చేపట్టాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.
30 మంది సిబ్బంది.. ఆరు ఉపకేంద్రాలు.. అయినా సమస్యలు ఎందుకు?
తలకొండపల్లి మండలంలో విద్యుత్ శాఖకు చెందిన వివిధ విభాగాల్లో సుమారు 30 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. లైన్‌మెన్లు, జూనియర్ లైన్‌మెన్లు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, ఏఈతో పాటు ఇతర సిబ్బంది ఇందులో ఉన్నారు. ఆరు విద్యుత్ ఉపకేంద్రాల్లో సుమారు 17 మంది ఆపరేటర్లు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. మండల వ్యాప్తంగా సుమారు 9,800 గృహ విద్యుత్ వినియోగదారులు ఉండగా, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ద్వారా సుమారు 7,500 మంది రైతులు విద్యుత్ వినియోగిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఇంత పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్న ప్రాంతంలో విద్యుత్ శాఖ పనితీరు, సరఫరా వ్యవస్థ, రైతుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం సాయంత్రం తలకొండపల్లి మండలంలోని చిన్నపాటి చిరుజల్లులకే చుక్కాపూర్, చీపునుంతల గ్రామాలలో కరెంటు లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్నపాటి వర్షపు జల్లులకే కరెంట్‌లో లోపాలు ఏర్పడితే సరి చేసే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోపం ఏర్పడిన వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని సరి చేస్తే సమస్య మళ్ళీ మళ్ళీ ఎందుకు ఉత్పన్నమవుతుందని పేర్కొంటున్నారు.
బదిలీలతోనైనా వ్యవస్థలో మార్పు అవసరం..
ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిని ఇతర ఉపకేంద్రాలకు లేదా పక్క మండలాలకు బదిలీ చేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. సిబ్బంది మార్పుతోనే విధుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని, స్థానిక పరిచయాల ప్రభావం తగ్గుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఆమనగల్ బ్లాక్ స్థాయిలో విద్యుత్ సరఫరా పరిస్థితి, సిబ్బంది పనితీరు, రైతుల పెండింగ్ దరఖాస్తులు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల మంజూరు ప్రక్రియపై జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా విద్యుత్ శాఖ అధికారులు, ఏడీ, డీఈ, ఎస్సీ స్థాయి అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏళ్ల తరబడి ఒకే చోట కొనసాగుతున్న సిబ్బంది వ్యవస్థపై సమీక్ష జరిపి, అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టి, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. రైతులు డీడీలు చెల్లించినా పనులు జరగకపోవడం, కొత్తగా చెల్లించిన వారికి పనులు వేగంగా పూర్తవుతున్నాయనే ఆరోపణలపై ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు. విద్యుత్ సరఫరా, రైతుల సమస్యల పరిష్కారం విషయంలో అధికారులు ఇకనైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, లేకపోతే ఆందోళనలకు దిగాల్సి వస్తుందని పలువురు రైతులు హెచ్చరిస్తున్నారు.






