విద్యుత్ రంగంలోనూ పోర్టబిలిటీ.. నచ్చిన డిస్కంను సెలెక్ట్ చేసుకునే ఛాన్స్

by Naga Rani Yarlagadda |

టెలికాం రంగంలో మొబైల్ నంబర్ మార్చకుండానే నచ్చిన నెట్‌వర్క్‌కు మారే పోర్టబిలిటీ సదుపాయం మాదిరిగానే.. త్వరలోనే విద్యుత్ పంపిణీ రంగంలోనూ వినియోగదారులు తమకు నచ్చిన విద్యుత్ సరఫరా కంపెనీ (డిస్కం)ని ఎంచుకునే విప్లవాత్మక విధానానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

విద్యుత్ రంగంలోనూ పోర్టబిలిటీ.. నచ్చిన డిస్కంను సెలెక్ట్ చేసుకునే ఛాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : టెలికాం రంగంలో మొబైల్ నంబర్ మార్చకుండానే నచ్చిన నెట్‌వర్క్‌కు మారే పోర్టబిలిటీ సదుపాయం మాదిరిగానే.. త్వరలోనే విద్యుత్ పంపిణీ రంగంలోనూ వినియోగదారులు తమకు నచ్చిన విద్యుత్ సరఫరా కంపెనీ (డిస్కం)ని ఎంచుకునే విప్లవాత్మక విధానానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కరెంట్ కనెక్షన్, స్తంభాలు, వైర్లు పాత కంపెనీవే అయినప్పటికీ.. సేవలందించే పంపిణీ సంస్థను మార్చుకునేలా పారలల్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్సింగ్ ఫ్రేమ్‌వర్క్‌పై కేంద్ర ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. వికసిత్ భారత్-2047 లక్ష్యానికి అనుగుణంగా దేశంలోని విద్యుత్ వినియోగదారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన, నాణ్యమైన, చవకైన విద్యుత్‌ను అందించే లక్ష్యంతోనే కేంద్ర విద్యుత్ శాఖ ఈ సేవలకు శ్రీకారం చుడుతోంది. విద్యుత్ చట్టం-2003 ద్వారా విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం (ట్రాన్స్‌మిషన్), ట్రేడింగ్ విభాగాల్లో ఇప్పటికే పోటీ వాతావరణం తీసుకొచ్చినప్పటికీ.. పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) రంగంలో ఇప్పటికీ ఏకఛత్రాధిపత్యం నడుస్తోంది. ఈ రంగాన్ని కూడా ప్రైవేట్, పోటీ రహిత విధానాల నుంచి విముక్తి చేసి వినియోగదారుల చేతికి ఎంపిక చేసుకునే హక్కును ఇవ్వడమే ఈ కొత్త విధానం యొక్క ప్రధాన ఉద్దేశం.

వీలింగ్ చార్జీలు చెల్లిస్తే చాలు..

ప్రస్తుతం ఉన్న చట్టప్రకారం ఒక ప్రాంతంలో రెండో విద్యుత్ పంపిణీ సంస్థ లైసెన్స్ పొందాలంటే, వారు కూడా సొంతంగా స్తంభాలు, సబ్‌స్టేషన్లు, లైన్లు వేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల బహుళ నెట్‌వర్క్‌లు ఏర్పడి, వేల కోట్ల మూలధన వ్యయం వృథా కావడంతోపాటు కొత్త పెట్టుబడులు రాకుండా పోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్రం సరికొత్త నెట్‌వర్క్ షేరింగ్ మోడల్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేట్ డిస్కంలు తమ భౌతిక నెట్‌వర్క్‌ను యథావిధిగా నిర్వహించి, సొంతం చేసుకుంటాయి. రంగంలోకి వచ్చే కొత్త పంపిణీ సంస్థలు (లైసెన్సీలు) పాత కంపెనీల నెట్‌వర్క్‌ను వినియోగించుకున్నందుకుగాను నిర్ణీత వీలింగ్ చార్జీలు చెల్లిస్తాయి. మొబైల్ నెట్‌వర్క్ సేవలు నచ్చకపోతే సిమ్ నంబర్ మారకుండానే వేరే కంపెనీకి మారే పోర్టబిలిటీ సౌకర్యం ఉన్నట్లే.. కరెంట్ వినియోగదారులు కూడా సేవల ఆధారంగా తమకు నచ్చిన విద్యుత్ పంపిణీ సంస్థను ఎంచుకునే వెసులుబాటు రాబోతోంది.

కార్మికులకు, డిస్కంలకు రక్షణ..

నూతన సంస్కరణల వల్ల ప్రస్తుతం ఉన్న డిస్కం ఉద్యోగులు లేదా కార్మికులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, హక్కుల భద్రతకు పూర్తిగా రక్షణ కల్పిస్తున్నారు. అంతేకాకుండా కేవలం లాభాలు వచ్చే వ్యాపార, పారిశ్రామిక వినియోగదారులకే సేవలు అందించి, సాధారణ గృహ వినియోగదారులను నిర్లక్ష్యం చేయకుండా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లు (ఎస్ఈఆర్సీ) పారదర్శకంగా, ఏ ఒక్కరికీ వివక్ష లేకుండా ఈ సేవలు అందేలా పర్యవేక్షిస్తాయి. ఇప్పటికే ఈ తరహా పవర్ పోర్టబిలిటీ మోడల్ ముంబై నగరంలో విజయవంతంగా అమలులో ఉందని, అక్కడ వినియోగదారులు తమకు కావలసిన సరఫరాదారుని ఎంచుకునే వెసులుబాటును పొందారని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ విధానం దేశమంతటా అమల్లోకి వస్తే డిస్కంల మధ్య నాణ్యమైన విద్యుత్, తక్షణ కస్టమర్ కేర్ సేవలందించడంలో తీవ్ర పోటీ నెలకొని అంతిమంగా సామాన్య వినియోగదారుడికి లబ్ధి చేకూరనుంది.

ఇప్పటికే కన్సల్టేటివ్ కమిటీ భేటీ..

ఇప్పటికే కేంద్ర విద్యుత్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ అధ్యక్షతన పారలల్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్సింగ్ ఫ్రేమ్‌వర్క్‌పై కీలక కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్, పలువురు ఎంపీలు, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు. విద్యుత్ పంపిణీ రంగంలో నూతన సంస్కరణలు, పారలల్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్సింగ్ ఫ్రేమ్‌వర్క్ రూపకల్పన, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడం, ఉమ్మడి నెట్‌వర్క్ వినియోగంపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు. చట్టంలో అవసరమైన మార్పులు చేస్తూనే.. సేవల్లో పారదర్శకత, పోటీతత్వాన్ని పెంచేలా రాష్ట్రాల రెగ్యులేటరీ కమిషన్ల పర్యవేక్షణలో ఈ కొత్త విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని కమిటీ ప్రతిపాదించింది. ఈ అంశంలో కేంద్రం ఓ కచ్చితమైన ప్రణాళికతో ఉంది కాబట్టి త్వరలోనే విద్యుత్ రంగంలోనూ పోర్టబిలిటీ వచ్చేసినట్లేనని నిపుణులు చెబుతున్నారు.

Next Story