సంక్రాంతి పేరుతో ప్రైవేటు ట్రావెల్స్ నిలువు దోపిడీ

by Malleboina Mahesh |   (  Updated:2026-01-11 02:04:21  IST  )

సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యుల తో జరుపుకోవాలనే తపనతో లక్షలాది మంది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు బయలుదేరుతున్న వేళ, ప్రయాణికుల బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా దోపిడీకి తెగబడుతోంది.

సంక్రాంతి పేరుతో ప్రైవేటు ట్రావెల్స్ నిలువు దోపిడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యుల తో జరుపుకోవాలనే తపనతో లక్షలాది మంది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు బయలుదేరుతున్న వేళ, ప్రయాణికుల బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా దోపిడీకి తెగబడుతోంది. బస్సు లు దొరకడం లేదు, దొరికినా ఆకాశాన్ని తాకే చార్జీలతో ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ట్రాఫిక్ పీక్‌కు చేరుకుంది. రైళ్లలో బెర్తులు దొరకడం లేదు. ఏ ట్రైన్ కోసం ట్రై చేసినా రిగ్రెట్ అనే వస్తుంది. స్లీపర్, ఏ సీ, థర్డ్, సెకండ్, ఫస్ట్ క్లాస్... ఇలా అన్ని బెర్తులు నిండిపోయాయి. పోనీ బస్సులైనా ఎక్కుదామా అంటే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వేసినా డిమాండ్‌కు సరిపోవడం లే దు. ఈ పరిస్థితిని పూర్తిగా క్యాష్ చేసుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు కుమ్మక్కై రేట్లను ఇష్టానుసారంగా పెంచేశాయి.

రూ.700 టికెట్ రూ.3500కి

సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు వంటి రూట్లలో ఆఫర్లతో కలుపుకుని ప్రైవేటు బస్సు టికెట్ రూ.600 నుంచి రూ.1200 మధ్య ఉంటుంది. కానీ సంక్రాంతి డిమాండ్ పేరుతో ఇదే టికెట్‌ను రూ.2,000 నుంచి రూ.3,500 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని ట్రావెల్స్ ఏజెన్సీ లు డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో నాలుగు రెట్లు ధర పెంచాయి. ఆన్‌లైన్ టికెట్ జారీ చేసే రెడ్ బస్, అభిబస్ వంటి వెబ్‌సై ట్స్‌లోనూ స్పష్టంగా పెంచిన రేట్లు దర్శనమి స్తున్నాయి. ఆన్‌లైన్ బుకింగ్ యాప్స్‌లో సీ ట్లు లేవని చూపించి, అదే బస్సుల్లో ఏజెంట్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో అధిక ధరలకు అమ్ముతున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్ బ స్టాండ్ల వద్ద ట్రావెల్స్ ఏజెంట్లు ‘ఇది లాస్ట్ సీట్.. డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. కాసేపాగితే అదీ పోతుంది’ అంటూ ప్రయాణికులను భయపెట్టి డబుల్, ట్రిపుల్ ధరల కు టికెట్లు అంటగడుతున్నారు.

గ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులతో సంక్రాంతి పండుగ జరుపు కోవాలనుకునే ఉద్యోగులు, కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలపై ఈ భారం ఎక్కువగా పడుతోంది. ‘టికెట్ ఖర్చే పండుగ ఖర్చుగా మారింది’ అంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి తూర్పు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ వెళ్లే రూట్లలో డిమాండ్ ఎక్కువగా ఉండడం తో ప్రైవేటు ట్రావెల్స్ మరింతగా దోపిడీ చేస్తున్నాయి. విశాఖపట్టణం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు వెళ్లే బస్సులు కొరతగా మారడంతో ధరలు విచ్చలవిడిగా పెరిగాయి.

అధికారుల మౌనమే మాఫియాకు బలం

రెండు రాష్ట్రాల రవాణా శాఖలు, ఆర్టీసీ అధికారులు ఈ అక్రమ ధరల పెంపుపై కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే ఈ మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పండుగ సీజన్‌లో ఫిక్స్‌డ్ రేట్లు, గరిష్ఠ చార్జీల నియంత్రణ లేకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా టికెట్ల భారీ పెంపు పై తక్షణమే నియంత్రణ అవసరమని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఏటా సంక్రాంతి వచ్చిందంటే చాలు తమ ప్రయాణాల అవసరాలను ఆసరగా చేసుకుని టికెట్ల రేట్లు పెంచుతూ తమ జేబులు ఖాళీ చేస్తున్నారని కాకినాడకు చెందిన సుబ్రమణ్యం ‘దిశ’కు తెలిపారు. ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని, గరిష్ట టికెట్ ధరలు నిర్ణయించడం, అక్రమంగా అధిక చార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్‌పై దాడులు చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్- ఆఫ్‌లైన్ బుకింగ్ మోసాలపై చర్యలు తీసుకోవడం వంటి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story