జీవో 42ను తుంగలో తొక్కుతున్న ప్రైవేట్ స్కూళ్లు

by Batti.Sumithra |

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ జీవో నెం. 42కు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయని విద్యా సంఘాల నాయకులు ఆరోపించారు.

జీవో 42ను తుంగలో తొక్కుతున్న ప్రైవేట్ స్కూళ్లు
X

దిశ, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ జీవో నెం. 42కు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయని విద్యా సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు మండల విద్యాధికారి (ఎంఈఓ) హేమలతకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 42 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు నిర్ణీత పరిమితిలోనే ఫీజులు వసూలు చేయాలి. ట్యూషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు మినహా ఇతర పేర్లతో అదనపు రుసుములు వసూలు చేయరాదు. అయితే జమ్మికుంటలోని పలు ప్రైవేట్ పాఠశాలలు ఈ నిబంధనలను పట్టించుకోకుండా 'ఐఐటీ ఫౌండేషన్', 'మెడికల్ ఫౌండేషన్', 'కరిక్యులర్ యాక్టివిటీస్', 'స్మార్ట్ క్లాస్' తదితర పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయని విద్యా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

రక్తాన్ని జలగలు పీల్చినట్లు తల్లిదండ్రుల నుంచి డబ్బులు గుంజుతున్నారు అని వారు మండిపడ్డారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ విద్యార్థుల మార్కులు, ఉత్తీర్ణత శాతం విషయంలో ఆయావిద్యాసంస్థలు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోతున్నాయని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుకంటే డబ్బులపైనే యాజమాన్యాలు ఎక్కువ దృష్టి పెడుతున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా జమ్మికుంట మండల విద్యాసంఘం అధ్యక్షుడు గడ్డం సత్యవిష్ణు, వరుణ్, కర్మల, సాయిచరణ్, సాయికుమార్, వినయ్ తదితరులు ఎంఈఓ హేమలతను కలిసి వినతిపత్రం అందజేశారు. జమ్మికుంటలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలో వసూలు చేస్తున్న ఫీజుల పై తక్షణమే విచారణ చేపట్టాలని, జీవో నెం. 42ను ఉల్లంఘించిన పాఠశాలల పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే గుర్తింపును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ప్రతి జిల్లాలో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిటీలను చురుకుగా పనిచేసేలా చర్యలు తీసుకుని, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కోరారు.

విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల పాలిట శాపంగా మారిన ప్రైవేట్ పాఠశాలల పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపకపోతే పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు విద్య మరింత భారంగా మారుతుంది అని విద్యా సంఘాల నాయకుడు అమ్మ వెంకటేష్ హెచ్చరించారు. ఈ విషయం పై ఎంఈఓ హేమలత స్పందిస్తూ, వచ్చిన ఫిర్యాదు పై సమగ్ర విచారణ జరిపించి, నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Next Story