- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇసుక లారీల వల్ల నిండు ప్రాణం బలి...
కనీసం మనిషి ప్రాణానికి కూడా విలువ లేని పరిస్థితి దాపరిస్తుంది.

దిశ, మణుగూరు: ఈ సమాజం ఎటు పోతుంది. కనీసం మనిషి ప్రాణానికి కూడా విలువ లేని పరిస్థితి దాపరిస్తుంది. ఇసుకకు ఉన్న విలువ కూడా మనిషి ప్రాణానికి లేకుండా పోతుంది. అయినా కానీ అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం రావడం లేదు. దీనివలన లారీ డ్రైవర్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఇలాంటి దుస్థితి పినపాక నియోజకవర్గం లో దాపరించింది. మనిషి ప్రాణాలు పోతున్నాయి.. సరే పట్టించుకునే దిక్కే లేకుండా పోతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని మణుగూరు- ఏటూరి నాగారం ప్రధాన రహదారిలోని రామానుజ వరం గ్రామంలోనిర్వహించే ఇసుక ర్యాంపు మనుషుల ప్రాణాలను బలిగొనే యమపాషాలుగా తయారయ్యాయి. ఇసుక ర్యాంపు నిర్వాహకులు వారి ర్యాంపుకు వచ్చే లారీలకు సరైన పార్కింగ్ ఏర్పాటు చేయకపోవడంతో నడి రోడ్లపై వారి లారీలను పార్కింగ్ చేస్తున్నారు. దీనివలన రోడ్డుపై ప్రయాణం చేసే మిగతా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ధనార్జనే ధ్యేయంగా...
రెండు నుంచి మూడు గంటల మేర ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రజల ప్రాణాలతో లెక్క లేనట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఇసుక ర్యాంపుల లారీల వలన ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయినా సరే అధికారులకు గాని, ఇసుక ర్యాంపుల నిర్వాహకులు గాని ఇదేమీ పట్టదు. ధనార్జనే ధ్యేయంగా సాగుతున్నారు. సంబంధిత అధికారులు కూడా వీరికి వత్తాసు పలుకుతూ జేబులు నింపుకుంటున్నారే తప్ప ప్రమాదాలను అరికట్టే ఆలోచనలు మాత్రం చేయడం లేదు. తాజాగా మణుగూరు ఏటూరునాగారం ప్రధాన రహదారి సాంబాయి గూడెం-రామానుజవరం మధ్యలో ఇసుక లారీలకు పార్కింగ్ లేక నడి రోడ్డుపై లారీలను నిలుపుదల చేయడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లే లోపు..
ఇదే సమయంలో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో డైలీ వేస్ కూలి పనులు నిర్వహించే పినపాక మండలం గడ్డి గూడెం గ్రామానికి చెందిన వంశీ (33) గడ్డి మందు సేవించాడు. దీంతో అక్కడే ఉన్న తనతో పని చేసే తోటి కార్మికులు 108 ద్వారా మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇదే సమయంలో ట్రాఫిక్ జామ్ కావడంతో అంబులెన్స్ వెళ్లే దారి లేక దిక్కు తోచని స్థితిలో తోటి కార్మికులు వంశీని చేతులపై మోసుకొని వచ్చారు. ఈ సంఘటన చూపరులందర్నీ కంటతడి పెట్టించింది. ఇంత చేసిన ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. మణుగూరు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లే లోపు వంశీ ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. అయినా సరే అధికారంలో మాత్రం ఎలాంటి చలనం లేకపోవడం అనుమానాలకు దారితీస్తుంది. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో మండిపడుతున్నారు. ఇసుకపై ఉన్న శ్రద్ధ మనుషుల ప్రాణాలపై ఉండదా అంటూ ప్రశ్నిస్తున్నారు.






