- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తహశీల్దార్ ఆఫీసుల్లో 'ప్రైవేట్' రాజ్యం!
ప్రభుత్వ కార్యాలయాల్లో అత్యంత కీలకమైన, ప్రజల భూ ఆస్తులకు రక్షణగా నిలిచే తహశీల్దార్ కార్యాలయాలు ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల అడ్డాగా మారుతున్నాయి.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: ప్రభుత్వ కార్యాలయాల్లో అత్యంత కీలకమైన, ప్రజల భూ ఆస్తులకు రక్షణగా నిలిచే తహశీల్దార్ కార్యాలయాలు ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల అడ్డాగా మారుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు తహశీల్దారు ఆఫీసుల్లో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ రికార్డు సెక్షన్లను ప్రైవేట్ వ్యక్తులు, గ్రామ పంచాయతీ స్థాయికి చెందిన ఇతర వ్యక్తుల చేతుల్లో పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. సిబ్బంది కొరత నెపంతోనో, లేదా అంతర్గత అవినీతి కోసమో కానీ, అధికారిక సిబ్బంది మాత్రమే తాకాల్సిన రికార్డులను థర్డ్ పార్టీ వ్యక్తులు ఇష్టారాజ్యంగా హ్యాండిల్ చేస్తుండటం గమనార్హం.
ప్రైమ్ మండలాల్లోనూ అదే తంతు.. అధికారులను మించిన ఆజమాయిషీ!
జిల్లాలోని ప్రైమ్ మండలాలు (భూముల విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు) మొదలుకొని మారుమూల మండలాల వరకు ఇదే తరహా వ్యవహారం నడుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని మండలాల్లో రికార్డుల పర్యవేక్షణ కోసం పేరుకు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారులు ఉన్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో మాత్రం వారి కింద ఉండే ప్రైవేట్ వ్యక్తులు, జీపీవోల పూర్తి ఆజమాయిషీ సాగుతోందనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. సీట్లలో కూర్చోవాల్సిన అధికారులు పక్కకు తప్పుకుని, రికార్డుల రూమ్‌ను ఈ అనాధికారిక వ్యక్తులకే అప్పగించేయడం గమనార్హం. ఏ భూమి ఎవరి పేరు మీద ఉంది? ఎవరి రికార్డులు మార్చవచ్చు? అనే కీలక సమాచారం వీరికి సులువుగా చిక్కుతోంది.
అర్జీదారులపై దురుసు ప్రవర్తన.. అవినీతి ఆరోపణలు..
తహశీల్దారు ఆఫీసుల్లోని రికార్డు సెక్షన్లలో తిష్టవేసిన ఈ ప్రైవేటు వ్యక్తుల ప్రవర్తన పై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. భూ సమస్యలపై వచ్చే పేద అర్జీదారులతో వీరు అత్యంత దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు రికార్డుల పరిశీలన, ఫైళ్ల కదలిక కోసం వెనుక ఉండి పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తహశీల్దార్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు..?
కార్యాలయాల్లో ఇంత బహిరంగంగా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా, అత్యంత కీలకమైన విభాగాన్ని అర్హత లేని వ్యక్తుల చేతుల్లో పెడుతున్న.. స్థానిక తహశీల్దార్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కళ్ల ముందే ఇంత వ్యవహారం నడుస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక అంతర్గతంగా ఏమైనా ఉందా? లేక అధికారుల అండదండలతోనే ఈ వ్యవస్థ నడుస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డుల నిర్వహణలో "అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్" వర్తిస్తుందని తెలిసి కూడా ప్రైవేటు వ్యక్తులకు గేట్లు బారాలా తెరవడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
ఉన్నతాధికారులు స్పందించేనా?
జిల్లా వ్యాప్తంగా ఉన్న తహశీల్దార్ కార్యాలయాల్లో రికార్డుల భద్రత ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలోని అన్ని తహశీల్దార్‌ల ఆఫీసుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, రికార్డు సెక్షన్లలో తిష్టవేసిన ప్రైవేట్, ఇతర శాఖల వ్యక్తులను తక్షణమే తొలగించాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకొని ప్రజల భూ రికార్డులకు రక్షణ కల్పించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






