- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శిథిలమైన కేసారం పాఠశాల భవనం.. పట్టించుకోని అధికారులు
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలంలోని కేసారం గ్రామ ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారింది.

దిశ, మోమిన్ పేట్: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలంలోని కేసారం గ్రామ ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారింది. గోడలు పగుళ్లు పడటం, పైకప్పు శిథిలమవడం, సిమెంట్ పెచ్చులు ఊడి పడటం వంటి పరిస్థితులతో భవనం ఎప్పుడు కూలిపోతుందోనన్న భయం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను వెంటాడుతోంది. ఈ ప్రమాదకర భవనాన్ని వెంటనే కూల్చివేసి నేలమట్టం చేయాలని, విద్యార్థులను సురక్షిత ప్రదేశంలో బోధించాలని గ్రామస్తులు, తల్లిదండ్రులు పలుమార్లు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు కేవలం హామీలకే పరిమితమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భవనం మరింత ప్రమాదకరంగా మారిందని, ఏ క్షణంలోనైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగి విద్యార్థుల ప్రాణాలు బలైన తర్వాత స్పందించడం కాకుండా, ఇప్పుడే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. "ప్రమాద ఘంటికలు స్పష్టంగా మోగుతున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఏదైనా అపశృతి జరిగితే బాధ్యత ఎవరిది?" అని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి శిథిల భవనాన్ని కూల్చివేసి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కేసారం గ్రామ ప్రజలు కోరుతున్నారు. "విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే నిర్లక్ష్యానికి ముగింపు పలికి, ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలి" అని తల్లిదండ్రులు, గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.






