- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిజిటల్ అరెస్టులపై పంజా.. తెలుగు రాష్ట్రాలు సహా 16 రాష్ట్రాల్లో సీబీఐ రెయిడ్స్
దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై సీబీఐ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఇద్దరిని అరెస్టు చేయడంతో పాటు పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డిజిటల్ అరెస్టులపై సీబీఐ పంజా విసిరింది. ఈ స్కామ్‌ల నెట్‌వర్క్‌ను ఛేదించడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) గురువారం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇవాళ దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లోని 80 ప్రాంతాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించింది. సుప్రీంకోర్టు అధికారిక వెబ్‍సైట్‍ను పోలీన ఒక నకిలీ వెబ్‍సైట్‍ను గుర్తించిన నేపథ్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మణిపూర్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
రూ.2 కోట్ల లావాదేవీలు.. ఇద్దరి అరెస్ట్
200కు పైగా డిజిటల్ అరెస్ట్ కేసులతో సంబంధం ఉన్న ఒక పెద్ద నేరపూరిత నెట్‌వర్క్‌ను నిర్మూలించడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సీబీఐ ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ కంపెనీలను (షెల్ కంపెనీలు) సృష్టించి, సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ... మ్యూల్ బ్యాంక్ ఖాతాల (మనీ లాండరింగ్ కోసం వాడే ఇతరుల ఖాతాలు) ద్వారా దాదాపు రూ. 2 కోట్ల అక్రమ సొమ్మును దారి మళ్లించినందుకు గానూ చెన్నైకి చెందిన బి. నరేష్, కోల్‌కతాకు చెందిన సంజీబ్ సాహాలను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున నేరానికి సంబంధించిన పత్రాలు, డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ లావాదేవీల రికార్డులను సీబీఐ స్వాధీనం చేసుకున్నారు. వీటిని మరింత లోతుగా విశ్లేషించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అయితే ఈ ముఠా కేవలం భారతీయులనే కాకుండా, పలు ఇతర దేశాల పౌరులను కూడా మోసం చేసినట్లు ఆధారాలు లభించడంతో.. సీబీఐ అంతర్జాతీయ ఛానెల్స్ ద్వారా ఆయా దేశాల దర్యాప్తు సంస్థలను కూడా అలర్ట్ చేసినట్లు సమాచారం.






