9వ తరగతి పుస్తకాల్లో ‘ఎమర్జెన్సీ’ పాఠం.. NCERT నిర్ణయాన్ని సమర్థించిన బీజేపీ

by Kema Shiva Kumar |

9వ తరగతి పుస్తకాల్లో ‘ఎమర్జెన్సీ’ పాఠం.. NCERT నిర్ణయాన్ని సమర్థించిన బీజేపీ
X

దిశ, వెబ్‌డెస్క్: నాటి ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) దేశంలో విధించిన ‘ఎమర్జెన్సీ’కి సంబంధించిన ప్రత్యేక అధ్యాయాన్ని 9వ తరగతి పాఠ్యపుస్తకంలో చేర్చాలన్న ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) నిర్ణయాన్ని బీజేపీ పూర్తిగా సమర్థించింది. ఇందిరా ప్రధానిగా ఉన్న కాలంలో చీకటి రోజులు, ప్రజాస్వామ్య అణచివేతను నేటి తరం విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ స్పష్టం చేసింది. ఎన్‌సీఈఆర్టీ నిర్ణయంపై ఆ పార్టీ జాతీయ ప్రతినిధులు స్పందిస్తూ.. దేశ చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగిన, అదే సమయంలో రాజ్యాంగ విలువలను కాలరాసిన ఎమర్జెన్సీ కాలం గురించి పాఠ్యాంశాల్లో చేర్చడం రాజకీయ చర్య కాదన్నారు. అది చారిత్రక సత్యాన్ని విద్యార్థులకు అందించడమేనని పేర్కొన్నారు. యువతకు దేశ ప్రజాస్వామ్య రక్షణ పట్ల అవగాహన కల్పించడానికి ఎమర్జెన్సీ పాఠం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

అయితే, NCERT నిర్ణయంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే తరాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రతికూలతను, విద్వేషాన్ని పెంచేందుకే కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో పాఠ్య పుస్తకాల్లో ఇలా మార్పులు చేశారని ఆరోపించారు. విద్యా వ్యవస్థను సైతం రాజకీయాలకు వాడుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించి 51 ఏళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో ఎన్‌సీఈఆర్‌టీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశంగా మారింది.

Next Story