బాలిక అదృశ్యం.. గాలింపు చర్యలు ముమ్మరం

by Taduka Kalyani |

రెబ్బెన మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని దుర్గం గౌతమి అదృశ్యమైనట్లు సమాచారం.

బాలిక అదృశ్యం.. గాలింపు చర్యలు ముమ్మరం
X

దిశ, రెబ్బెన: రెబ్బెన మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని దుర్గం గౌతమి అదృశ్యమైనట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం కళాశాలకు వచ్చిన విద్యార్థిని, గురువారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో హాస్టల్ ప్రహరీ గోడ దూకి బయటకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించినట్లు తెలిసింది. విద్యార్థిని కనిపించకపోవడంతో కళాశాల ప్రిన్సిపాల్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రెబ్బెన పోలీసులు సీఐ సంజయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విద్యార్థిని ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయమై సీఐ సంజయ్‌ను వివరణ కోరగా, విద్యార్థిని అదృశ్యం కావడానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. కుటుంబ సభ్యులు, కళాశాల సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తూ విద్యార్థిని ఆచూకీ కోసం సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థిని క్షేమంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆమెకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే సమీప పోలీసు అధికారులకు తెలియజేయాలని సీఐ సంజయ్ విజ్ఞప్తి చేశారు.

Next Story