డ్రగ్ ఫ్రీ తెలంగాణకు యువత మద్దతుగా నిలవాలి

by Taduka Kalyani |

డ్రగ్ ఫ్రీ తెలంగాణకు యువత మద్దతుగా నిలిచి పోలీసులకు సహకరించాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, ఐపీఎస్ పిలుపునిచ్చారు.

డ్రగ్ ఫ్రీ తెలంగాణకు యువత మద్దతుగా నిలవాలి
X

దిశ, శంషాబాద్: డ్రగ్ ఫ్రీ తెలంగాణకు యువత మద్దతుగా నిలిచి పోలీసులకు సహకరించాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, ఐపీఎస్ పిలుపునిచ్చారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా చైతన్యపరిచే లక్ష్యంతో శంషాబాద్ పోలీసులు మండల పరిధిలోని కాచారం గ్రామంలోని వర్ధమాన్ కళాశాలలో డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిషనర్ తరుణ్ జోషి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఎన్‌డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు ఉంటాయని వివరించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని, డ్రగ్ ఫ్రీ తెలంగాణ సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. డ్రగ్స్ బారిన పడితే జీవితాలు నాశనం అవుతాయని, డ్రగ్స్ రవాణా చేయడం, వినియోగించడం రెండూ కూడా నేరమేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, ఐపీఎస్, ఈగల్ ఫోర్స్ ఎస్పీలు గిరిధర్, సీతారాం, చేవెళ్ల ఏసీపీ కిషన్, శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డి, శంషాబాద్ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని, డ్రగ్ ఫ్రీ తెలంగాణ నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Next Story