- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజన్న సిరిసిల్లలో పల్స్ పోలియోకు సర్వం సిద్ధం..
జిల్లాలో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ తెలిపారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : జిల్లాలో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆమె సూచించారు. పల్స్ పోలియో, నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ, సీజనల్ వ్యాధుల నివారణ చర్యల పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం నిర్వహించిన డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పల్స్ పోలియో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో 0 నుంచి ఐదేళ్లలోపు 41,147 మంది పిల్లలు ఉన్నారని, వారికి టీకాలు అందించేందుకు 393 వ్యాక్సినేషన్ కేంద్రాలు, 38 మంది సూపర్‌వైజర్లు, 15 మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యాసంస్థల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా జిల్లాలో ఒక సంవత్సరం నుంచి 19 ఏళ్లలోపు 1,33,695 మందికి జూలై 13న నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జూలై 20 వరకు అర్హులైన వారందరికీ మాత్రలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగీ తదితర సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి మంగళవారం, శుక్రవారం ‘డ్రై డే’ గా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, ఫాగింగ్ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






