ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి కొరత.. జడ్చర్లలో పేషెంట్ల తీవ్ర అవస్థలు

by Jakkula.Mamatha |

జడ్చర్లలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో గత మూడు రోజులుగా తాగునీరు, బాత్రూమ్‌లలో నీటి కొరతతో పేషెంట్లు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి కొరత.. జడ్చర్లలో పేషెంట్ల తీవ్ర అవస్థలు
X

దిశ, జడ్చర్ల: జడ్చర్లలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో గత మూడు రోజులుగా తాగునీరు, బాత్రూమ్‌లలో నీటి కొరతతో పేషెంట్లు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలోని పురుషుల బాత్‌రూమ్‌లో గత కొన్ని రోజులుగా నీళ్లు రాకపోవడంతో అధికారులు తాళం వేశారు. దీంతో పురుష పేషెంట్లు, అటెండర్లు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళా వార్డులోని బాత్రూమ్‌లలో కూడా సరిపడా నీళ్లు లేక మహిళా పేషెంట్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బయటి నుంచి బాటిల్లో నీళ్లు తెచ్చుకుని బాత్రూంకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. వైద్యం కోసం వచ్చిన వారు తాగునీటికి, కాలకృత్యాలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, దుర్వాసనతో ఆసుపత్రి వార్డుల్లో ఇబ్బందికరంగా మారిందని బాధితులు వాపోతున్నారు. ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై డ్యూటీ డాక్టర్లకు సమాచారం అందించిన కాంట్రాక్టర్‌కు సమాచారం ఇచ్చామని త్వరలోనే నీళ్లు వస్తాయని సమాధానం దాటవేస్తున్నారని వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లు వారి అటెండర్లు చెబుతున్నారు. ఆస్పత్రిని ఉన్నతాధికారులు సందర్శించినప్పుడు మాత్రం అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు. పురుషుల బాత్రూంకు తాళం వేశారంటేనే ఆ వార్డులో పేషంట్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. జిల్లా వైద్యాధికారులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని, బాత్రూమ్‌లను పరిశుభ్రంగా ఉంచాలని పేషెంట్లు, ప్రజలు కోరుతున్నారు. ఆసుపత్రి నిర్వహణ తీరు ఇలాగే ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయని అంటున్నారు. ఆ పరిస్థితులు రాకముందే ఆస్పత్రిలోని అన్ని వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు చెబుతున్నారు.

Next Story