- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వరదలు
అరుణాచల్ ప్రదేశ్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి.. కీయి పన్యోర్ జిల్లాలో విధ్వంసంపై సీఎం పెమా ఖండూ తీవ్ర దిగ్భ్రాంతి!

దిశ, వెబ్ డెస్క్: ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలు జలమయమవగా, కీయి పన్యోర్ (Keyi Panyor) జిల్లాలో సంభవించిన పెను వరదలు, కొండచరియలు విరిగిపడిన (Landslides) ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. కాగా ఈ వరదలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోల్లో ఆకస్మిక వరదల తీవ్రత స్పష్టంగా కనిపించింది. కాగా ఈ ఘోరమైన వరదలపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేశారు.
సీఎం పెమాఖండూ భావోద్వేగ పోస్ట్..
"అరుణాచల్ ప్రదేశ్‌లోని కీయి పన్యోర్ జిల్లాలో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణ నష్టం జరగడం, పెద్ద ఎత్తున విధ్వంసం కావడం నన్ను తీవ్రంగా కలచివేసిందని సీఎం పెమాఖండూ భావోద్వేగ పోస్ట్ చేశారు. ఈ ప్రకృతి వైపరిత్యంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని. మన ప్రజల భద్రత, శ్రేయస్సే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని అన్నారు. బాధితుల కోసం సహాయక, పునరావాస చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నష్టపోయిన ప్రతి కుటుంబానికి సాధ్యమైన అన్ని విధాలా సహాయాన్ని అందిస్తున్నాం. ఈ కష్టకాలంలో ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుంది." అని సీఎం పేర్కొన్నారు.
స్తంభించిన రవాణా వ్యవస్థ..
ఎడతెరిపిలేని వర్షాలు, భారీ వరదల కారణంగా ట్రాన్స్-అరుణాచల్ హైవే పరిధిలోని నెయిపో ల్యాండ్‌స్లైడ్ జోన్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో యాజాలి-కీయి పన్యోర్ జిల్లాల మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో వందలాది ఇళ్లు నీట మునిగాయి. సమాచారం అందుకున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి లిబంగ్ పెలిన్ తక్షణమే కీయి పన్యోర్ జిల్లాకు చేరుకుని అధికారులను అప్రమత్తం చేశారు. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.






