- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామాలను జల్లెడ పడుతున్న ప్రైవేటు విద్యాసంస్థలు
వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే సమయం ఆసన్నమైంది.

దిశ, తలకొండపల్లి : వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే సమయం ఆసన్నమైంది. జూన్ 15 నుంచి ప్రభుత్వ పాఠశాలలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. అయితే, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మాత్రం గత 20 రోజులుగా గ్రామాలు, గిరిజన తండాలు అనే తేడా లేకుండా ప్రతి ఊరు, ప్రతి వాడను జల్లెడ పడుతున్నాయి. "మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించండి" అంటూ రంగురంగుల కరపత్రాలను చూపిస్తూ ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆమనగల్ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఉదయం 6 గంటలకే గ్రామాలకు చేరుకుని ప్రచారం నిర్వహిస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులను తమ పాఠశాలల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మాత్రం గ్రామాల్లో విద్యార్థుల చేరికల కోసం ప్రచారం నిర్వహిస్తున్న దాఖలాలు కనిపించకపోవడం గమనార్హం.
తలకొండపల్లిలో 99.55 శాతం ఉత్తీర్ణత
గత నెలలో విడుదలైన పదో తరగతి ఫలితాల్లో తలకొండపల్లి మండలంలోని 10 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు జిల్లాలోనే అత్యుత్తమ ఉత్తీర్ణతను నమోదు చేశాయి. మొత్తం 448 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, కేవలం ఇద్దరు మాత్రమే ఫెయిల్ అయ్యారు. దీంతో మండల ఉత్తీర్ణత శాతం 99.55గా నమోదైంది. మండలంలోని 10 ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిది పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. కేవలం ఒక ఉన్నత పాఠశాలలో మాత్రమే ఇద్దరు విద్యార్థులు అనారోగ్య కారణాల వల్ల స్వల్ప మార్కులతో ఉత్తీర్ణత సాధించలేకపోయారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య..
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, రెండు జతల యూనిఫాంలను ఉచితంగా అందిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యను అందిస్తోంది. ఇలాంటి సౌకర్యాలు, నాణ్యమైన బోధన అందుబాటులో ఉన్నప్పటికీ, కొందరు తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) చంప్లా నాయక్ పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో కొన్నిచోట్ల కనీసం ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ కూడా పూర్తి చేయని ఉపాధ్యాయులు బోధన చేస్తున్న పరిస్థితులు ఉన్నాయని, అలాంటి పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించడం ఉత్తమమని ఆయన సూచించారు. అదేవిధంగా, ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు చెల్లించడంతో పాటు పిల్లలను బస్సుల ద్వారా పట్టణ ప్రాంతాలకు పంపించడం వల్ల తల్లిదండ్రుల పై అదనపు ఆర్థిక భారం పడుతోందని, ముఖ్యంగా పేద కుటుంబాలకు ఇది మరింత నష్టదాయకమవుతుందని ఎంఈఓ చంప్లా నాయక్ పేర్కొన్నారు.






