- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వనస్థలిపురం, నాగోల్‌లో జోరుగా లింగ నిర్ధారణ దందా..
డబ్బుల కోసం గర్భస్థ శిశువు లింగాన్ని నిర్ధారిస్తూ, ఆడపిల్ల అయితే అబార్షన్లకు పాల్పడుతున్న ఘటన వనస్థలిపురం, నాగోల్‌లో జోరుగా నడుస్తోంది.

దిశ, వనస్థలిపురం: ‘పుట్టబోయే బిడ్డ ఆడా.. మగా..’ అనే ఆసక్తిని ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌ల నిర్వాహకులు చట్టాన్ని తుంగలో తొక్కుతూ.. లింగ నిర్ధారణ పరీక్షల దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిషేధం, కఠిన చట్టాలు అమలులో ఉన్నప్పటికీ కాసుల కోసం గర్భస్థ శిశువు లింగాన్ని నిర్ధారిస్తూ, ఆడపిల్ల అయితే అబార్షన్లకు పాల్పడుతున్నారు. ఈ అక్రమ స్కానింగ్ దందా గత శుక్ర, శని వారాల్లో వనస్థలిపురం, తుక్కుగూడ, నాగోల్ ప్రాంతాల్లో ఒక్కసారిగా వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ శివారు ప్రాంతాల్లో లింగ నిర్ధారణ పరీక్షల దందా ఓ నెట్‌వర్క్‌లా విస్తరించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌ల నిర్వాహకులు, సంబంధిత శాఖ వైద్యాధికారుల ప్రోత్సాహంతోనే దందా నడిపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నెలవారీ మామూళ్ల మత్తులో అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తూ ఆడబిడ్డల ఉసురు తీస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
జోరుగా లింగ నిర్ధారణ పరీక్షలు
ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం, మన్సూరాబాద్, నాగోల్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనే ఆరోపణలున్నాయి. తాజాగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుబడిన హయగ్రీవ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల గర్భాశయంలో ట్యూమర్‌తో వచ్చిన ఓ మహిళ నిండుప్రాణం పోయినా.. హాస్పిటల్ యాజమాన్యం తీరు మారడం లేదని విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో కఠిన చర్యలు తీసుకుని ఆస్పిటల్ను సీజ్ చేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో నామ్‌కే వాస్తే చర్యలు చేపట్టడంతో మళ్లీ సదరు ఆస్పత్రి యాజమాన్యం లింగనిర్ధారణ పరీక్షలతో పాటు ఎన్నో అక్రమాలకు తెరలేపింది. వనస్థలిపురంలో ఈ ఒక్క ఆస్పత్రే కాకుండా.. పదుల సంఖ్యలో ఆస్పత్రుల యాజమాన్యాలు.. ధనార్జనే ధ్యేయంగా ఎలాంటి నిబంధనలు పాటించకుండా, రోగులకు నాణ్యమైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయినా వైద్యాధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్లినిక్‌లు కేంద్రంగా స్కానింగ్ దందా..
ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఈ లింగ నిర్ధారణ దందాను ఫస్ట్ ఎయిడ్ క్లినిక్స్‌తో పాటు మెడికల్ షాపుల్లో గుట్టుగా చేస్తున్నట్టు తుక్కుగూడ, నాగోల్ ఉదంతాలతో అర్థమవుతోంది. పోలీసులు డెకాయ్ ఆపరేషన్లతో హయగ్రీవ ఆస్పత్రి నిర్వాహకుల సమాచారంతో తుక్కుగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్‌పై దాడి చేసి పరీక్షలు చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదే విధంగా నాగోల్‌లోని జైపురి కాలనీలోనూ డెకాయ్ ఆపరేషన్‌లో ‘కేసరి మెడికల్ అండ్ జనరల్ స్టోర్, ఫస్ట్ ఎయిడ్ సెంటర్’ లో అబార్షన్లు చేస్తూ ఇద్దరు పట్టుబడ్డారు. ఇలాంటి అర్హత లేని వైద్యుల చేతిలో పడి తరచూ గర్భిణుల ప్రాణాలు కోల్పోతున్నారు. హస్తినాపురం, బీఎన్‌రెడ్డి ప్రాంతాల్లోని ఆయా కాలనీల్లో కొందరు సొంతంగా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకొని లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు. లింగ నిర్ధారణ మొదలు, అబార్షన్ల దందా ముఖ్యంగా సాగర్హైవేను ఆనుకుని ఉన్న ప్రాంతాలు వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి, హస్తినాపురం తదితర ప్రాంతాల్లో కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
కాసులకు కక్కుర్తిపడి అబార్షన్లు..
ఎస్వోటీ, వనస్థలిపురం, నాగోల్ పోలీసులు 24 గంటల వ్యవధిలో రెండు చోట్ల నిర్వహించిన డెకాయిట్ ఆపరేషన్లతో లింగ నిర్ధారణ నెట్‌వర్క్ చాపకింద నీరులా ఏస్థాయిలో విస్తరించిందో అర్ధం అవుతోంది. లింగ నిర్ధారణ పరీక్ష కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కడుపులో బేబీ ఆడబిడ్డ అని తేలితే.. వైద్య శిబిరం తరహాలో వారం లేదా 15 రోజులకోసారి నిర్వహిస్తున్నారు. వైద్య నిపుణుల ప్రమేయం లేకుండానే అబార్షన్ కిట్లు ఇచ్చి గర్భస్రావాలు చేయిస్తున్నారు. ఈ గర్భవిచ్ఛిత్తి కోసం రూ. 25వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్లినిక్‌లు, మెడికల్ షాపుల్లో ఎక్కువ శాతం అబార్షన్లు జరుగుతున్నాయి. ఇందులో కొందరు ఆర్ఎంపీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్లు లేకుండానే పలు ఆస్పత్రుల్లో ఈ తంతు నిత్యకృత్యంగా మారడం గమనార్హం. జిల్లా అధికారులు కొందరూ ఈ ఆస్పత్రుల నిర్వాహకులతో కుమ్మక్కుతో ఈ దందా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హడావుడి చేశారు.. వదిలేశారు!
వైద్యారోగ్య, మహిళా, శిశు సంక్షేమశాఖలు క్షేత్రస్థాయిలో నిరంతర తనిఖీలు నిర్వహించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు నెలల కిందట హయత్‌నగర్, వనస్థలిపురం, నాగోల్ ప్రాంతాల్లో అనుమతులు లేని ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు, అర్హత లేని వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందంతో పాటు వైద్యారోగ్యశాఖ నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించింది. హయత్‌నగర్ పరిధిలో కొందరు నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేయగా అనుమతులు లేని రెండు మూడు ఆస్పత్రులను, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను సెంటర్లను సీజ్ చేశారు. అప్పటి వరకే హడావుడి చేసిన వైద్యారోగ్య శాఖ మళ్లీ తనిఖీలు చేయకపోవడంతో లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా వైద్యారోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల తనిఖీలు నామమాత్రంగానే ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ గర్భస్రావాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, హయగ్రీవ హాస్పిటల్ సహా సంబంధిత కేంద్రాల అనుమతులను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఆస్పత్రిని సీజ్ చేశాం.. డాక్టర్ స్వర్ణకుమారి, డీఎంహెచ్‌వో, రంగారెడ్డి జిల్లా
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ.. పట్టుబడిన హయగ్రీవ ఆస్పత్రిని సీజ్ చేసి, ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను కూడా సస్పెండ్ చేశాం. జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న అవకతవకలపై ప్రత్యేక దృష్టి సారించాం. ముఖ్యంగా ఎల్బీనగర్ పరిధిలోని వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో పలు ఆస్పత్రులపై ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే దాదాపు 10 ఆస్పత్రుల జాబితాను సిద్ధం చేసి తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. సోమవారం నుంచి ఆయా ఆస్పత్రుల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తాం. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆస్పత్రులను ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో అక్రమ వైద్య కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం.






