ఈ ఏడాది జైళ్లలో ఖైదీల అడ్మిషన్లు 11.8 శాతం పెరిగాయి.. తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-12 07:46:21  IST  )

తెలంగాణ జైళ్ల శాఖ-2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక గణాంకాలను విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే జైలు అడ్మిషన్లలో 11.8 శాతం వృద్ధి నమోదైందని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్ర వెల్లడించారు.

ఈ ఏడాది జైళ్లలో ఖైదీల అడ్మిషన్లు 11.8 శాతం పెరిగాయి.. తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జైళ్ల శాఖ-2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక గణాంకాలను విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే జైలు అడ్మిషన్లలో 11.8 శాతం వృద్ధి నమోదైందని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్ర వెల్లడించారు. ఇవాళ చంచల్‌గూడలో ప్రిసెన్స్ అకాడమీలో ఆమె తెలంగాణ జైళ్ల శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా సౌమ్యా మిశ్రా మాట్లాడుతూ.. ముఖ్యంగా సైబర్ నేరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించిందని పేర్కొన్నారు. 2024లో 34,811 మంది ఖైదీలు ఉండగా.. 2025 నాటికి 36,627 మంది ఖైదీలు పెరిగారని తెలిపారు. ఇక సివిల్ కేసుల్లో 20 మంది ఖైదీలుగా జైళ్లకు వచ్చాయని వెల్లడించారు. ఇక సైబర్ నేరాలు అత్యధికంగా 135.6 శాతం పెరిగాయని పేర్కొన్నారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 152 శాతం పెరుగుదల కనిపించిందని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే జైళ్లలో విదేశీయుల అడ్మీషన్ల సంఖ్య గణనీయంగం తగ్గిందని స్పష్టం చేశారు. జైలుకు వస్తున్న వారిలో 18 నుంచి 30 ఏళ్ల లోపు యువత సంఖ్య 19,413గా ఉందన్నారు.

జైళ్లలో సాంకేతికత, మౌలిక సదుపాయాలు..

జైళ్ల శాఖలో పారదర్శకతను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.2.5 కోట్లతో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పంపిణీ చేసిందని సౌమ్య మిశ్ర తెలిపారు. కోర్టు ప్రొడక్షన్లలో 69.47 శాతం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. సిద్దిపేటలో 415 మంది సామర్థ్యంతో అత్యాధునిక ‘స్వస్తిక’ సెల్స్ కలిగిన జిల్లా జైలు ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. సందర్శకుల కోసం ‘స్వాగతం’ పోర్టల్, ఖైదీల కోసం 52 కియోస్క్ (KIOSK) యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

అక్షరాస్యులుగా 23,220 మంది ఖైదీలు..

2025లో 79 శాతం మంది కాన్విక్ట్ ఖైదీలకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇచ్చామని సౌమ్య మిశ్రా వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఎక్కడా లేని విధంగా ఖైదీలకు వడ్డీ లేని రుణాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని.. ఈ ఏడాది 58 మందికి రూ.18.66 లక్షల రుణాలు మంజూరు చేశామన్నారు. ప్రతిష్టాత్మకంగా ‘థంబ్ ఇన్ - సైన్ అవుట్’ కార్యక్రమం ద్వారా 23,220 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా దేశంలోనే మొదటిసారిగా జైళ్లలో డీ-అడిక్షన్ సెంటర్లను ప్రారంభించామని పేర్కొన్నారు. ఇక ఆరు జైళ్లలో పర్యావరణ హితంగా తేనెటీగల పెంపకాన్ని చేపట్టి 489 కిలోల తేనెను సేకరించామని తెలిపారు. పాత వార్తాపత్రికలు, ప్లాస్టిక్, ఇనుప తుక్కును ఉపయోగకరమైన వస్తువులుగా మార్చే కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు. ఖైదీల పునరావాసం, పునరేకీకరణలో చేసిన కృషికి తెలంగాణ జైళ్ల శాఖకు ప్రతిష్టాత్మక SKOCH అవార్డు లభించిందని వెల్లడించారు. చేర్యాలపల్లి సెంట్రల్ జైలు దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన జైలుగా ఎంపికై గోల్డ్ మెడల్ సాధించిందని అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన 7వ ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్‌లో తెలంగాణ ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకుందని సౌమ్య మిశ్రా తెలిపారు.

Next Story