Badminton : సంచలనం సృష్టించిన రౌనక్.. వరల్డ్ నం.6‌కు షాకిచ్చిన భారత యువ ప్లేయర్

by Harish |   (  Updated:2026-06-26 19:27:52  IST  )

యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ ప్లేయర్ రౌనక్ చౌహాన్ అద్భుత విజయం అందుకున్నాడు.

Badminton : సంచలనం సృష్టించిన రౌనక్.. వరల్డ్ నం.6‌కు షాకిచ్చిన భారత యువ ప్లేయర్
X

దిశ, స్పోర్ట్స్ : యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ ప్లేయర్ రౌనక్ చౌహాన్ అద్భుత విజయం అందుకున్నాడు. రెండో రౌండ్‌లో ఏకంగా టాప్ సీడ్, వరల్డ్ నం.6 ప్లేయర్ చౌ టియెన్ చెన్(చైనీస్ తైపీ)‌ను ఓడించాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 21-17, 26-24 తేడాతో విజయం సాధించాడు. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 80వ స్థానంలో ఉన్న రౌనక్.. టైటిల్ ఫేవరెట్‌పై వరుసగా రెండు గేముల్లోనే నెగ్గడం విశేషం. 49 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో 18 ఏళ్ల భారత ఆటగాడు మొదటి నుంచి చివరి వరకూ పోరాట పటిమ కనబరిచాడు. ప్రత్యర్థి నుంచి తీవ్రమైన సవాల్ ఎదుర్కొని నిలబడ్డాడు. తొలి గేములో రౌనక్ ఒక దశలో 8-5 లీడ్‌లో ఉండగా.. గేము జరుగుతున్న కొద్ది చౌ టియెన్ చెన్ పుంజుకుని 17-15తో ఆధిక్యంలోకి దూసుకొచ్చి గేము గెలిచేలా కనిపించాడు. ఈ పరిస్థితుల్లో పట్టుదల వీడని రౌనక్ వరుసగా 6 పాయింట్లు నెగ్గి ప్రత్యర్థికి చెక్ పెట్టాడు. ఇక రెండో గేము చాలా వరకు చౌ టియెన్ చెన్ చేతుల్లోనే ఉంది. ఒకానొక సమయంలో 17-11తో రౌనక్ చాలా వెనుకబడి ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో కూడా రౌనక్ అద్భుతం చేశాడు. వరుసగా 6 పాయింట్స్ నెగ్గి 17-17తో స్కోరును సమం చేసి అనూహ్యంగా పోటీలోకి వచ్చి రెండో గేమును కూడా నెగ్గాడు. రెండో రౌండ్‌లో సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టాడు.

మరో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ కూడా క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్‌లో మలేసియాకు చెందిన లీ జి జియా‌ను 21-14, 21-13 తేడాతో ఓడించి టోర్నీలో ముందడుగు వేశాడు. మహిళా క్రీడాకారిణులు కూడా సత్తాచాటారు. తన్వి శర్మ, రక్షిత శ్రీ, దేవిక సిహాగ్ కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. అయితే, మహిళల డబుల్స్‌లో భారత స్టార్ క్రీడాకారిణులు ట్రీసా జాలీ, గాయత్రి గోపిచంద్‌లకు నిరాశ ఎదురైంది. రెండో రౌండ్‌లో గాయత్రి జోడీ 19-21, 8-21 తేడాతో జపాన్‌కు చెందిన సుమిరె నకాడె-మియు తకాహషి జోడీ చేతిలో ఓడిపోయి ఇంటిదారిపట్టింది.

Next Story