- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాన్యులకు అందుబాటులో.. సర్కారీ లే అవుట్లు!
హైదరాబాద్ మహా నగరం శరవేగంగా విస్తరిస్తోంది. మొన్నటి వరకు గ్రేటర్ పరిధి దాటి ఓఆర్‌ఆర్ వరకు విస్తరించిన నగరం.. నేడు హెచ్‌ఎండీఏ పరిధి దాటి ట్రిపుల్‌ఆర్ వరకూ పెరిగిపోయింది.

దిశ, రంగారెడ్డి బ్యూరో : హైదరాబాద్ మహా నగరం శరవేగంగా విస్తరిస్తోంది. మొన్నటి వరకు గ్రేటర్ పరిధి దాటి ఓఆర్‌ఆర్ వరకు విస్తరించిన నగరం.. నేడు హెచ్‌ఎండీఏ పరిధి దాటి ట్రిపుల్‌ఆర్ వరకూ పెరిగిపోయింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సదుపాయాల కల్పనతోపాటు ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా కొత్త ప్రాంతాలను అభివృద్ది చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలో ఔటర్ చుట్టూ జంక్షన్లకు సమీపంలో పెద్ద ఎత్తున వెంచర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో.. రైతులు ఒప్పుకుంటే పట్టా భూములను సైతం ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించాలని ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. తద్వారా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా టౌన్ షిప్‌లను ఏర్పాటు చేసేందుకు అవకాశం కలగడంతోపాటు ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి ఊతం ఇచ్చినట్లు అవుతుందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
10వేలకు పైగా ఎకరాల్లో వెంచర్లు
వెంచర్ల ఏర్పాటుకు సంబంధించి అధికార యంత్రాంగం భూముల అన్వేషణలో నిమగ్నమైంది. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయన్న వివరాలను ఇప్పటికే గుర్తించారు. అలాగే రైతుల వద్ద ఉన్న అసైన్డ్, లావణి, ఇనాం తదితర భూములను సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ భూముల పక్కనే పట్టా భూములు ఉంటే రైతులతో సంప్రదింపులు జరిపి ఆయా భూములను కూడా సేకరించనున్నారు. మోకీల, బుద్వేల్ వంటి ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ ల్యాండ్ పూలింగ్ విధానంలో భూముల విక్రయాలు జరిపి ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని రాబట్టుకుంది. ఇదే క్రమంలో కొత్తగా ఔటర్ వెంట ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టుల ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే హెచ్‌ఎండీఏ ఇన్ముల్ నెర్వ, నాదర్ గుల్-కూర్మల్ గూడ, లేమూర్ తదితర ప్రాంతాల్లో 270 ఎకరాల వరకు గుర్తించింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో దాదాపు 500 ఎకరాలు లే అవుట్లకు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే శంకర్ పల్లి, కందుకూరు వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూముల లభ్యత ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మొత్తంగా ఈ రెండు జిల్లాల పరిధిలో ఓఆర్‌ఆర్ వెంట 10వేలకు పైగా ఎకరాల్లో లే అవుట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పేదలకు అందుబాటులోకి..
రంగారెడ్డి జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్డు, ట్రిపుల్‌ఆర్ మధ్య పరిశ్రమలు, ఐటీ సంస్థలు ఏర్పాటవుతున్నాయి. వీటిల్లో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వీరు పనిచేసే చోటుకు రావాలంటే సుదూర ప్రయాణం చేయాల్సి వస్తోంది. పనిచేసే ప్రాంతానికి దగ్గరగా నివాసాలు ఉంటే.. ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇదే రీతిన ఆలోచన చేస్తున్నది. ట్రాఫిక్ తగ్గడం, సమయం ఆదా కావడమే కాకుండా.. ఆర్థికంగా కూడా ఆదా అవుతుంది. అంతేగాకుండా హైదరాబాద్ ప్రధాన నగరంపై వనరులు, సేవల సదుపాయాల కోసం ఒత్తిడి కూడా తగ్గుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం లే అవుట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. అందులో రోడ్లు, డ్రైనేజీ వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. అయితే ఇప్పటివరకు హెచ్‌ఎండీఏ వేలం వేసిన ప్లాట్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఔటర్ రింగు రోడ్డు వెంట పెద్ద ఎత్తున ఏర్పాటు చేసే వెంచర్లలో 150 గజాలు, 200 గజాల నుంచి ఆపైన విస్తీర్ణంలో ప్లాట్లను సిద్దం చేసి మధ్యతరగతి ప్రజలు సైతం కొనుగోలు చేసేలా ధరలను అందుబాటులోకి తేచ్చేలా ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఔటర్‌కు సమీపంలోనే ట్రిపుల్ ఆర్ రానుండడంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చాలామంది ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండడంతో సర్కారీ లే అవుట్లకు విపరీతమైన డిమాండ్ ఉండనున్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి.






