ప్రధాని పొదుపు చర్యల పిలుపు.. ప్రభుత్వ వైఫల్యమేనా?

by Muthe.Rajitha |   (  Updated:2026-05-13 13:56:36  IST  )

ఇటీవల హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు చర్యల పిలుపునివ్వడం వెనక దేశ ఆర్థికవైఫల్యం ఏమైనా ఉందా? అనే అంశంపై విశ్లేషణ

ప్రధాని పొదుపు చర్యల పిలుపు.. ప్రభుత్వ వైఫల్యమేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశం నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందింది. అయితే ఒక దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా, దాని ఆర్థిక వృద్ధిని నిర్ణయించేది 'బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్' (Balance of Payments). అంటే ఆ దేశం ప్రపంచ దేశాలతో చేస్తున్న వ్యాపారంలో లాభాల్లో ఉందా లేక నష్టాల్లో ఉందా అనే అంశం. గత పదేళ్ల (2014-2026) కాలంలో భారత ఎగుమతులు, దిగుమతుల ప్రయాణాన్ని విశ్లేషిస్తే, ఎగుమతుల్లో కొన్ని రంగాల్లో స్వల్ప లాభాలు ఉన్నప్పటికీ దిగుమతుల్లో తీవ్ర నష్టాలు కనిపిస్తున్నాయి. ఈ నష్టాల వల్లే ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు చర్యలకు పిలుపునిచ్చారా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. మరి దేశ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్నదేమిటో చూద్దాం..

అంతర్జాతీయ వ్యాపార లెక్కలు ఎలా ఉంటాయంటే?

సాధారణ భాషలో చెప్పాలంటే, భారతదేశం ప్రస్తుతం 'వ్యాపార లోటు' (Trade Deficit)లో ఉంది. అంటే మనం విదేశాలకు అమ్ముతున్న వస్తువుల విలువ కంటే, విదేశాల నుంచి కొంటున్న వస్తువుల విలువ చాలా ఎక్కువగా ఉంది. దీనిని మెర్కంటైల్ ట్రేడ్ అంటే వస్తువుల వ్యాపారం అంటారు. తాజా గణాంకాల ప్రకారం (FY 2025-26).. భారత్ నుంచి వస్తువుల ఎగుమతులు 441.78 యూఎస్ బిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 774.98 యూఎస్ బిలియన్ డాలర్లున్నాయి. అంటే మెర్కంటైల్ ట్రేడ్ లో మన దేశానికి 333.19 యూఎస్ బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 30 లక్షల కోట్ల నికర నష్టం వాటిల్లింది. అయితే, ఈ లోటును కొద్దో గొప్పో పూడ్చడానికి మన దగ్గర ఉన్న ఏకైక ఆధారం 'సేవల రంగం' (Services Sector) అంటే.. సాఫ్ట్‌వేర్ సేవలు (IT), విదేశాల్లో ఉన్న భారతీయులు పంపే నిధులు (Remittances), పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాలు. వీటి ద్వారా దేశానికి 213.89 బిలియన్ డాలర్ల మిగులు (Surplus) ఉన్నపటికీ.. లాభ నష్టాలు రెండిటినీ కలిపి చూస్తే ఓవరాల్‌గా భారత్ ఇంకా 119.30 బిలియన్ డాలర్లు అంటే రూ. 11.393 లక్షల కోట్ల లోటులోనే కొనసాగుతోంది.

గత పదేళ్ల పతనం.. రూ.లక్షల కోట్లు!

గత పదేళ్లలో (2014 నుండి 2024-25 వరకు) భారత వ్యాపార లోటు గణాంకాలను పరిశీలిస్తే.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 137 బిలియన్ డాలర్ల వ్యాపార లోటులో ఉండగా.. అయిదేళ్లలో అంటే 2018-19 వరకు 184 యూఎస్ బిలియన్ డాలర్లు అంటే రూ.4.80 లక్షల కోట్ల నష్టం పెరిగింది. ఆ తరువాత కోవిద్ సమయంలో దిగుమతులు ఆగిపోవడం వల్ల 2020-21 లో వ్యాపార నష్టం 102.2 బిలియన్ డాలర్ల నష్టం మాత్రమే నమోదు కాగా.. ఆ మరుసటి ఏడాదికే ఆ లోటు ఏకంగా 264 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక ప్రభుత్వ ప్రస్తుత వివరాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అత్యంత భారీగా 333.19 బిలియన్ డాలర్ల ట్రేడ్ డెఫిసిట్ నమోదు కావడం గమనార్హం. గడిచిన గత పదేళ్లలో సగటున ప్రతి ఏటా మనం దాదాపు 150 నుండి 200 బిలియన్ డాలర్ల వరకు లోటును చవిచూస్తున్నాం. ఈ పదేళ్ల మొత్తం నష్టాన్ని లెక్కిస్తే అది వేల లక్షల కోట్లకు చేరుతుంది.

లోటుకు ప్రధాన కారణాలివే!

మన దేశం ఎందుకు నష్టాల్లో ఉన్నదో తెలియాలంటే, మన దిగుమతుల జాబితాను చూడాలి. భారతదేశం తన చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతుంది. అంతర్జాతీయంగా చమురు ధర ఒక్క డాలర్ పెరిగినా, మన దేశం వేల కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. రెండవ అతిపెద్ద కారణం.. బంగారం. 2025-26లో భారత బంగారం దిగుమతులు రికార్డు స్థాయిలో 72 బిలియన్ డాలర్లకు చేరాయి. అంటే కేవలం అలంకారం కోసం మనం 800 టన్నుల బంగారం దిగుమతి చేసుకోగా.. అందుకోసం అక్షరాల రూ. 6.88 లక్షల కోట్ల రూపాయలను డాలర్ల రూపంలో విదేశాలకు చెల్లించాల్సి వచ్చింది. అందుకే ప్రభుత్వం ఇటీవల బంగారంపై దిగుమతి సుంకాన్ని 6% నుండి 15% కి భారీగా పెంచింది. అలాగే, మనం వాడుతున్న మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం చైనా వంటి దేశాలపై ఆధారపడటం కూడా మనకు పెద్ద దెబ్బగా మారింది.

భారీగా పడిపోతున్న రూపాయి విలువ

వాణిజ్య లోటు పెరిగే కొద్దీ డాలర్‌కు డిమాండ్ పెరుగుతుంది. రూపాయి విలువ తగ్గుతుంది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ రూ. 95.80 కి చేరుకుంది. రూపాయి బలహీనపడటం వల్ల మనం దిగుమతి చేసుకునే వస్తువులు (ఆయిల్, బంగారం, ఎలక్ట్రానిక్స్) ఇంకా ప్రియమవుతాయి. ఇది ఒక విషవలయంలా మారి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.

దేశ ఆర్థిక వ్యవస్థకు ఒయాసిస్ వీరే

వస్తువుల వ్యాపారంలో మనం ఇంత భారీ నష్టాల్లో ఉన్నా, దేశం దివాలా తీయకుండా స్థిరంగా ఉండటానికి కారణం రెండు ముఖ్యమైన అంశాలున్నాయి.

ఐటీ, సేవల ఎగుమతులు: మన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ప్రపంచానికి అందిస్తున్న సేవల వల్ల దేశానికి ఏడాదికి దాదాపు 418 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది.

విదేశీ నిధులు(Remittances): విదేశాల్లో ఉన్న భారతీయులు అంటే విదేశాల్లో ఉద్యోగులు, కార్మికులు తమ కుటుంబాల కోసం పంపే డబ్బు. 2025-26లో ఇది రికార్డు స్థాయిలో 135 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. మన దేశం మాత్రమే ప్రపంచంలోనే అత్యధికంగా విదేశీ నిధులు పొందుతుండగా.. ఈ నిధులు లేకపోతే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడో కుప్పకూలిపోయేది.

పొదుపు చర్యల పిలుపు.. వైఫ్యల్యాలు కారణమా?

ప్రస్తుతం మన దేశ ఓవరాల్ బ్యాలెన్స్ చూస్తే రూ.11 లక్షల కోట్ల నష్టాల్లోనే ఉన్నామన్నది సుస్పష్టం. అయితే ఇటీవల హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ వస్తువుల వాడకం తగ్గించాలని, బంగారం కొనడం మానేయాలని, వాహనాల వాడకం తగ్గించి ఇంధనం పొదుపు చేయాలని పిలుపునివ్వడం వెనక.. దేశ ఆర్థికవైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరి గత 10 ఏళ్లుగా లేని ఈ పొదుపు చర్యల అవసరం ఇప్పడే ఎందుకు అకస్మాత్తుగా ముందుకు అంటే.. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో వచ్చిన భారీ మార్పుల. నిజానికి పశ్చిమాసియా యుద్ధ సూచనలు వెలువడినపుడే కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త పడాల్సింది. కానీ ఆ యుద్ధంలో ఎలాగైనా అమెరికా-ఇజ్రాయెల్ గెలుస్తాయని, ఒక వారం పదిరోజులు సాగుతుంది అనుకున్న యుద్ధం కాస్త రెండు నెలలు దాటినా కొలిక్కి రాలేదు. పైగా ఇరాన్ హార్మూజ్ జలసంధి మూసివేయడం వలన ఆయిల్ ఒక్కటే కాదు, మన దేశానికి రావాల్సిన అన్ని రకాల దిగుమతులు ఆగిపోయాయి. అలాగే మనదేశానికి ఎగుమతుల ద్వారా వచ్చే కొద్దో గొప్పో ఆదాయం కూడా నిలిచిపోయింది.

ఇది మాత్రమే కాదు భారత్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా నేటి పొదుపు - పిలుపు కష్టాలకు కారణం అని తెలుస్తోంది. అందులో మొదటిది అమెరికా ఆంక్షల భయంతో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు భారీగా తగ్గించడ. మరొకటి భారత్ - పశ్చిమాసియాకు "గోల్డెన్ గేట్ వే" లాంటి చబహర్ పోర్టును వదిలేయడం. భారత్ తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల రష్యా నుంచి, ఇరాన్ నుంచి భారీ సబ్సిడీకి అందుతున్న ఇంధనాన్ని చైనా చేజిక్కించుకుంది. మన దేశ తీసుకున్న ఇలాంటి ముందుచూపు లేని చర్యల వల్ల ఓ వైపు మనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోబోతుండగా.. చైనా మాత్రం అందివచ్చిన అవకాశాలను వాడుకుంటూ వివిధ రంగాల్లో దూసుకుపోతోంది. అంతేకాదు ఈ పొదుపు పిలుపుల వలన కరోనా సంక్షోభంలో ఎదుర్కొన్నటువంటి మరో ఆర్థిక సంక్షోభం ఏదో రాబోతోంది అని ప్రజలు భయాందోళనకు గురయ్యి ప్యానిక్ బయ్యింగ్ కు ఎగబడే అవకాశం లేకపోలేదు.

ఇక్కడ గమయించాల్సిన మరొక విషయం.. సాక్షాత్తు దేశ ప్రధాని ఆయిల్ క్రైసిస్ ను ఎదుర్కునే సూచనలు ఉన్నాయి, వాహనాల వినియోగం తగ్గించడానికి ప్రజా రవాణాను వాడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం ఇవ్వండి అని ప్రజలకు పిలుపునిస్తుంటే.. ఆ పార్టీకి చెందిన నేతలు మాత్రం భారీ కాన్వాయ్ తో ర్యాలీలు తీస్తున్న దృశ్యాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్తశుద్ది లేని ప్రభుత్వం అంటూ ఇలా కూడా కేంద్రం ప్రజల్లో అబసుపాలవుతోంది. ఇక బంగారం కొనుగోళ్లు తగ్గించడానికి దిగుమతులు మానేయడం కంటే ప్రజలకు ఇంకేవైనా తాయిలాలు ఆశ చూపిస్తే కొంత తగ్గుముఖం పట్టె అవకాశం ఉంది. అలా కాకుండా దిగుమతులు నిలిపివేస్తే దొంగతనంగా స్మగ్లింగ్ పెరిగే ఛాన్స్ కూడా లేకపోలేదు. అయితే దేశంలో దశాబ్ద కాలంగా ఇంత ఆర్థిక అస్థిరత్వం ఉన్నప్పటికీ.. ఇవేవీ కూడా బీజేపీ పార్టీకి ఏ ఎన్నికల్లోనూ ప్రతికూలం కాకపోవడమే విశేషంగానూ.. అతిపెద్ద అంతుచిక్కని ప్రశ్నగానూ మిగిలిపోయింది.

వంట నూనెల దిగుమతులకు రూ.1.61 లక్షల కోట్లు.. భారత్ సొంతంగా ఎందుకు ఉత్పత్తి చేసుకోలేకపోతోంది

Next Story