- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వంట నూనెల దిగుమతులకు రూ.1.61 లక్షల కోట్లు.. భారత్ సొంతంగా ఎందుకు ఉత్పత్తి చేసుకోలేకపోతోంది?
భారత్ ఏటా రూ.1.61 లక్షల కోట్ల వంట నూనెను దిగుమతి చేసుకుంటోంది. అయితే ప్రధాని పొదుపు పాటించాలన్న నేపథ్యంలో ఈ అంశం చర్చగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: యుద్ధాలతో ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు పెరిగాయని దీంతో ఇటువంటి తరుణంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలంతా పొదుపు మంత్రం పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇంధనం పొదుపు చేయాలని, రసాయన ఎరువులు తగ్గించడంతో పాటు ఏడాది పాటు బంగారం కొనవద్దని విదేశీ ప్రయాణాలు వాయిదాలు వేసుకోవాలని ప్రధాని సూచించారు. అయితే వీటన్నింటితో పాటు పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకోవాల్సి వస్తున్నందున వంటనూనె వాడకాన్ని సైతం ప్రజలు తగ్గించాలని ప్రధాని ఇచ్చిన పిలుపు ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన మన దేశం తన ప్రజలకు అవసరమైన వంట నూనెను సొంతంగా ఎందుకు ఉత్పత్తి చేయలేకపోతోందనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
ఏటా రూ.1.61 లక్షల కోట్ల దిగుమతి:
భారతీయ వంటల్లో ప్రతిరోజూ వాడే నూనె ఒక నిత్యావసర వస్తువుగా ఉంది. అయితే దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని కిరాణా దుకాణాల్లో అమ్మే వంట నూనెలో సైతం అధిక భాగం దిగుమతి చేసుకున్నదేనన్న విషయం చాలా మంది ప్రజలకు తెలియదు. దేశంలో ఏటా 15 నుండి 16 మిలియన్ టన్నుల వంట నూనెను దిగుమతి జరుగుతోంది. ఇందు కోసం భారత్ ఏటా సుమారు 18.3 (రూ.1.61 లక్షల కోట్లు) బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తూ ప్రపంచంలోనే వంట నూనెలను దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది. విదేశాల నుంచి వంట నూనె దిగుమతులు చేసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోంది.
భరోసా లేకపోవడమే:
వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ నూనెగింజల సాగు లేకపోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే నూనెగింజల సాగు నష్టాలు తెచ్చిపెడుతుండటం, వరి, గోదువమ వంటి ఇతర పంటల మాదిరిగా వీటికి ప్రభుత్వం నుంచి సరైన భరోసా లేకపోవడం వల్ల రైతులు ఈ పంటల సాగుకు దూరం అవుతున్నట్లు వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో వరి, గోధుమలతో పోలిస్తే నూనెగింజల సాగుకు కేటాయిస్తున్న భూమి చాలా తక్కువగా ఉందని, వర్షపాతంలో అనిశ్చితి, తెగుళ్లు, వ్యాధులు, అస్థిరమైన ధరల కారణంగా రైతులు నూనెగింజల సాగును ప్రమాదకరంగా భావిస్తున్నారని చెబుతున్నారు. తక్కువ సారవంతమైన భూములు, నీటి పారుదల సౌకర్యాలు లేని ప్రాంతాల్లో వీటిని సాగు చేయడం వల్ల దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఆర్థిక కోణంలో చూస్తే వరి కంటే నూనెగింజలు లాభదాయకమైనప్పటికీ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్, బీమా వంటి రాయితీల వల్ల రైతులు వరి-గోధుమల సాగుకే మొగ్గు చూపేలా చేస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.
నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్:
అయితే పెరిగిన సాంకేతిక పురోగతి వల్ల ప్రస్తుతం తెగుళ్లను తట్టుకునే కొత్త రకం వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా దిగుబడిని 15-20 శాతం పెరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల వంట నూనెల రంగంలో దేశాన్ని 'ఆత్మనిర్భర్' (స్వయం సమృద్ధి)గా మార్చేందుకు మోడీ ప్రభుత్వం 'నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్'ను ప్రారంభించింది. 2024-25 నుండి 2030-31 వరకు కొనసాగే ఈ మిషన్ కోసం ప్రభుత్వం రూ. 10,103 కోట్లు కేటాయించింది. ఆవాలు, వేరుశనగ, సోయాబీన్, సన్‌ఫ్లవర్, నువ్వుల ఉత్పత్తిని పెంచడమే ఈ మిషన్ లక్ష్యం. 2022-23లో 39 మిలియన్ టన్నులుగా ఉన్న ప్రాథమిక నూనెగింజల ఉత్పత్తిని 2030-31 నాటికి 69.7 మిలియన్ టన్నులకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిగుమతులను తగ్గించడం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా, రైతులకు ఆదాయం పెరుగుతుందని తద్వారా అంతర్జాతీయ ధరల హెచ్చుతగ్గుల నుండి దేశానికి రక్షణ లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.






