- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పచ్చని కొత్తగూడెం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలి
వనమహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిస్తూ శ్రీనివాసగిరిలో మొక్కలు నాటిన డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి.

దిశ, పాల్వంచ టౌన్ : పర్యావరణ పరిరక్షణను ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా స్వీకరించి విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి పిలుపునిచ్చారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ శ్రీనివాసగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెట్లు మానవ మనుగడకు ప్రాణాధారమని, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ప్రతి మొక్క కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి, అది మహావృక్షంగా ఎదిగే వరకు సంరక్షించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించాలంటే పచ్చదనాన్ని పెంపొందించడం అత్యవసరమని పేర్కొన్నారు.
వనమహోత్సవాన్ని కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి ఇంటా, ప్రతి కాలనీలో పచ్చదనాన్ని విస్తరించే ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న హరిత కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించి పచ్చని కొత్తగూడెం నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటి వాటి సంరక్షణపై భక్త సమాజం సభ్యులు, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం ద్వారానే వనమహోత్సవ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు డీఎఫ్‌ఓ, ఎఫ్‌డీఓ, ఎంఆర్ఓ, డీఎస్పీ, ట్రస్ట్ చైర్మన్ కొత్త వెంకటేశ్వర్లు, డాక్టర్ సుధాకర్, జాముల సీతారాంరెడ్డి, మేయర్, కార్పొరేటర్లు సుగుణ, భవిత, సరిత, మనీ, విశ్వం, జీవీఆర్, సబీర్ పాషా, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్‌సీసీ వాలంటీర్లు, విద్యా వాలంటీర్లు, భక్తులు, కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






