ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం

by Malleboina Mahesh |

ప్రధాని మోడీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్’ ప్రదానం. మోదీ ఖాతాలో 33వ అంతర్జాతీయ అవార్డు!

ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం
X

దిశ, వెబ్ డెస్క్: ఇప్పటికే పదుల సంఖ్యలో వివిధ దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకున్న భారత ప్రధాని మోడీ (Indian Prime Minister Modi)కి మరో అరుదైన గౌరవం దక్కింది. యూరప్ పర్యటనలో ఉన్న ఆయనకు స్లోవేకియా (Slovakia) దేశం తమ అత్యున్నత జాతీయ పౌర పురస్కారమైన ‘ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్’ (1st Class) అవార్డును అందజేసింది. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో జరిగిన ఒక ప్రత్యేక అధికారిక వేడుకలో ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని చేతుల మీదుగా ప్రధాని మోడీ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ తాజా పురస్కారంతో కలిపి ప్రధాని మోడీ ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి రికార్డు స్థాయిలో 33 అంతర్జాతీయ అత్యున్నత పౌర బహుమతులను దక్కించుకున్నట్లయింది.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్లోవేకియా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అరుదైన గౌరవం కేవలం తనకు మాత్రమే దక్కింది కాదని, 140 కోట్ల మంది భారత ప్రజలకు దక్కిన నిజమైన గౌరవంగా ఆయన అభివర్ణించారు. భారత్-స్లోవేకియా దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బలమైన దౌత్య నీతికి, పరస్పర నమ్మకానికి ఈ అవార్డు ఒక నిదర్శనమని పేర్కొంటూ, ఈ పురస్కారాన్ని ఇరుదేశాల సుదీర్ఘ స్నేహబంధానికి అంకితం ఇస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.

Next Story