- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరారీలో క్రిప్టో స్కీం ప్రధాన నిందితుడు !
క్రిప్టో పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన ప్రధాన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆలేరు పట్టణానికి చెందిన బాధితులు ప్రభుత్వం, పోలీసు అధికారులను కోరుతున్నారు.

దిశ, ఆలేరు : క్రిప్టో పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన ప్రధాన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆలేరు పట్టణానికి చెందిన బాధితులు ప్రభుత్వం, పోలీసు అధికారులను కోరుతున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 2023 ఫిబ్రవరి నెల నుంచి "యూనిటీ మెటా" పేరుతో క్రిప్టో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలో భారీ లాభాలు వస్తాయని హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఎం.డి. గౌస్ అనే వ్యక్తి ఆలేరు ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. దీంతో ఆయన మాటలు నమ్మిన ఆలేరు పట్టణానికి చెందిన వందలాది మంది ఒక్కొక్కరు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడుల పేరుతో చెల్లించారు.
పరారీలో ప్రధాన నిందితుడు..
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎం.డి. గౌస్ (రామంతపూర్ నివాసి)తో పాటు అతని భార్య వజీద పై ఆలేరు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. రెండో నిందితురాలు (ఏ-2) వజీదను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, ప్రధాన నిందితుడు (ఏ-1) ఎం.డి. గౌస్ గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్నాడు.
రూ.10 కోట్ల వరకు వసూళ్లు..
ఆలేరు పట్టణంలోనే దాదాపు 500 మంది బాధితుల నుంచి సుమారు రూ.10 కోట్ల వరకు వసూలు చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ సొమ్ముతో ఆలేరు బృందావని కాలనీలో సుమారు రూ.1 కోట్ల విలువైన భవనం, పలు ప్లాట్లు కొనుగోలు చేయడంతో పాటు హైదరాబాద్‌లో కూడా అనేక స్థిరాస్తులు కూడబెట్టుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏప్రిల్ 10, 2026 నుంచి ప్రధాన నిందితుడు పరారీలో ఉండటంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫిర్యాదులపై యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేసి, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, అతని ఆస్తులను అటాచ్ చేసి స్వాధీనం చేసుకుని, మోసపోయిన బాధితులకు వారి సొమ్ము తిరిగి ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.






