- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండేళ్లుగా ఎంపీడీవో కార్యాలయంలోనే ప్రాథమిక పాఠశాల
మక్తల్ నియోజకవర్గం పరిధిలోని కృష్ణా మండల పరిషత్ కార్యాలయం విద్యార్థుల గోలతో గందరగోళంగా మారింది.

కృష్ణా మండల కేంద్రంలోని కన్నడ మీడియం ప్రాథమిక పాఠశాల భవనం కూలిపోవడంతో, రెండేళ్లుగా ఎంపీడీవో ఆఫీసులోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. ఆఫీసులో ఉన్న నాలుగు గదుల్లో రెండు గదులను కేటాయించి 45 మంది విద్యార్థులతో తరగతులు కొనసాగిస్తున్నారు. ఒకే ప్రాంగణంలో పాలన పనులు, బడి పిల్లల పాఠాలు సాగుతుండటంతో అటు అధికారులు, ఇటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిహద్దు ఒప్పందంలో భాగంగా కొనసాగుతున్న ఈ స్కూల్ భవనం ఐదేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరిన అధికారులు పట్టించుకోలేదు. గత ఏడాది పైకప్పులు కూలడంతో మంత్రి చొరవతో కొత్త భవనం కోసం రూ.60 లక్షల నిధులు మంజూరయ్యాయి. నిధులు మంజూరై ఏడాది గడుస్తున్నా నేటికీ పనులు ప్రారంభం కాకపోవడం పై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని త్వరగా భవనం పూర్తి చేయాలని కోరుతున్నారు.
దిశ, మక్తల్: మక్తల్ నియోజకవర్గం పరిధిలోని కృష్ణా మండల పరిషత్ కార్యాలయం విద్యార్థుల గోలతో గందరగోళంగా మారింది. ఇక్కడ ఒకే ప్రాంగణంలో పాలన విధులతో పాటు విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన సాగుతుండటంతో రెండేళ్ల నుంచి ఇరు వర్గాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయి. కృష్ణా మండల కేంద్రంలోని కన్నడ మీడియం ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా కూలిపోవడం, మండల కేంద్రంలో వేరే ప్రైవేటు భవనాలు దొరకకపోవడంతో పాఠశాలను ఎత్తేయకుండా తాత్కాలికంగా ఎంపీడీవో ఆఫీసులోకి మార్చారు. కార్యాలయంలో ఉన్న నాలుగు గదుల్లో చెరి రెండు గదులను కేటాయించి 45 మంది విద్యార్థులతో తరగతులు కొనసాగిస్తున్నారు.
భాషా పరమైన ఒప్పందం..
గతంలో భాష ప్రాతిపదికన రాష్ట్రాలు విడిపోతున్నప్పుడు, సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల అభీష్టం మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ఒప్పందం ప్రకారం కర్ణాటక, తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో రెండు భాషల ప్రభుత్వ పాఠశాలలను అనుమతించారు. ఇందులో భాగంగానే కృష్ణా మండల కేంద్రంలో దాదాపు 10 ప్రైమరీ స్కూళ్లు, ఒక హై స్కూల్ కన్నడ మీడియం తరగతులు సాగుతున్నాయి. వీరికి అనుగుణంగా ప్రభుత్వమే కన్నడ టీచర్లను నియమించి పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. అయితే, ఐదు సంవత్సరాల క్రితమే ఈ కన్నడ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరినప్పటికీ కలెక్టర్, పాలక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కూలిన పైకప్పులు - ఆఫీసులోకి షిఫ్ట్..
గత సంవత్సరం పాఠశాల భవనంలోని అన్ని గదుల పైకప్పులు పూర్తిగా కూలిపోవడంతో అధికారులు ఈ కన్నడ మీడియం పాఠశాల విద్యార్థులను మండల కార్యాలయంలోకి షిఫ్ట్ చేశారు. అరకొర వసతుల మధ్య ఆఫీసులోనే క్లాసులు నడుస్తుండడంతో అటు అధికారులు పాలన విధులు నిర్వర్తించలేక, ఇటు విద్యార్థులు సరిగ్గా చదువుకోలేక రెండు విభాగాలు ఇబ్బందులు పడుతున్నాయి. కార్యాలయానికి వచ్చే సర్పంచులు, ప్రజల రాకపోకల వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లడంతో, పాత భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం నిర్మించేందుకు గత సంవత్సరం రూ.60 లక్షల నిధులు మంజూరయ్యాయి.
నిర్మాణానికి నోచని భవనం..
ప్రభుత్వం నుంచి రూ.60 లక్షల నిధులు మంజూరై ఏడాది గడుస్తున్నా, నేటికీ కొత్త భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టకపోవడం గమనార్హం. నిధులు ఉండి కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లే పనులు ప్రారంభం కావడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి, కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి పెండింగ్‌లో ఉన్న పాఠశాల భవన నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థులను ఎంపీడీవో కార్యాలయం ఇబ్బందుల నుంచి తప్పించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






