విద్యార్థుల భవిష్యత్తుకు పునాది ప్రాథమిక విద్య : కలెక్టర్ కె. హరిత

by Batti.Sumithra |

విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది ప్రాథమిక విద్యేనని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుకు పునాది ప్రాథమిక విద్య : కలెక్టర్ కె. హరిత
X

దిశ, ఆసిఫాబాద్ : విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది ప్రాథమిక విద్యేనని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. ఆసిఫాబాద్ జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. ప్రాథమిక ఉపాధ్యాయులే విద్యా వ్యవస్థకు మూలస్తంభాలని పేర్కొన్న కలెక్టర్, ప్రాథమిక దశలోనే ప్రతి చిన్నారిలో చదవడం, రాయడం, గణించడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించే గొప్ప బాధ్యత ఉపాధ్యాయుల పై ఉందన్నారు. ఈ శిక్షణలో నేర్చుకున్న ఆధునిక బోధనా విధానాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేసి, ప్రతి విద్యార్థి అభ్యసన ఫలితాలను మెరుగుపర్చేందుకు కృషి చేయాలని సూచించారు.

అంతకు ముందు జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, డీఎఫ్‌వో బాలమణి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ఆర్డీవోలు లోకేశ్వర్‌రావు, చెన్నూరి కిషయ్యలతో కలిసి జిల్లాలో టీ-ఫైబర్ విస్తరణ పై టెలికాం సంస్థల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఇంటర్నెట్ సేవలను మరింత సౌకర్యవంతంగా అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అలాగే సేవల విస్తరణకు సంబంధించిన అనుమతులు, నివేదికలను సిద్ధం చేసి రాష్ట్ర అధికారులకు పంపించాలని సూచించారు. అనంతరం భూముల రీ-సర్వే పై సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో జిల్లాలో నక్షాలు లేని 37 గ్రామాలను గుర్తించామని, రెండో విడతలో 70 గ్రామాలను ఎంపిక చేశామని తెలిపారు. రీ-సర్వే పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించబడుతుందని, దీంతో భవిష్యత్తులో రైతుల మధ్య పొలాల హద్దులు, గట్లు తదితర భూవివాదాలు తలెత్తకుండా నివారించవచ్చని కలెక్టర్ హరిత పేర్కొన్నారు.

Next Story