‘ర‌హ‌దారులు.. పార్కులు కాపాడండి’.. హైడ్రా ప్ర‌జావాణికి 56 ఫిర్యాదులు

by Ramesh Naini |

మా లేఔట్ల‌ను కాపాడాల‌ని, ర‌హ‌దారులు, పార్కుల‌ ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాల‌ని ప‌లువురు సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు.

‘ర‌హ‌దారులు.. పార్కులు కాపాడండి’.. హైడ్రా ప్ర‌జావాణికి 56 ఫిర్యాదులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: లేఔట్‌ల‌ను మాయం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ అయిన గ్రామ‌పంచాయ‌తీ లేఔట్ల‌ను కూడా పూర్తిగా చెరిపేసి మొత్తం ఆక్ర‌మించుకుని ప్ర‌హ‌రీలు నిర్మించుకుంటున్నారు. మా లేఔట్ల‌ను కాపాడాల‌ని, ర‌హ‌దారులు, పార్కుల‌ ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాల‌ని ప‌లువురు సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. కుత్బుల్లాపూర్ స‌ర్వే నంబ‌రు 148లో నాలాపైన 23 గుంట‌ల వ‌ర‌కూ ఆక్ర‌మించి ప్ర‌హ‌రీ క‌ట్టేశార‌ని ప్ర‌జా బాధ్య‌త‌లు హ‌క్కుల చైత‌న్య వేదిక ఫిర్యాదు చేసింది. సంగారెడ్డి జిల్లా, రామచంద్రపురం మండలం కొల్లూరు ప్రాంతంలో 60 అడుగుల ప్రజా రహదారిని ఆక్రమించి అక్రమ ప్లాట్లు ఏర్పాటు చేశారని బాధితుడు బి. వెంకట్రామ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆక్రమణలను తొలగించి రహదారిని యథాతథంగా పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండ‌లం గాజులరామారంలోని సర్వే నంబర్ 79/1లో మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని 80 పేద కుటుంబాల కోసం కేటాయించినప్పటికీ, అందులో కేవలం ఒక ఎకరం మాత్రమే దోబీఘాట్‌కు అందిందని, మిగిలిన రెండు ఎకరాల్లో దేవాలయాల పేరుతో ఆక్రమణలు చేసి నోటరీల ఆధారంగా ఇళ్లు, షెడ్లు నిర్మిస్తున్నారని పేర్కొంటూ ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని రాజీవ్‌నగర్ రజక సేవా సంఘం ప్రతినిధులు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.

చెంగిచెర్ల గ్రామంలో లేఔవుట్‌..

చెంగిచెర్ల గ్రామంలో తమ లేఔవుట్‌లో ఉన్న 30 అడుగుల ప్రజా రహదారిని మూసివేయడంతో వెనుక వైపు నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీ సాయి కృష్ణ ఎన్‌క్లేవ్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఐలాపూర్ గ్రామంలో సర్వే నంబర్లు 199 నుంచి 206 వరకు ఉన్న భూమిపై హైకోర్టు స్టేటస్‌కో ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ ఆక్రమణలు కొనసాగిస్తూ ఆలయ నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు హైడ్రా దృష్టికి తీసుకువచ్చారు. ఇలా హైడ్రా సోమ‌వారం నిర్వ‌హించిన ప్ర‌జావాణికి మొత్తం 56 ఫిర్యాదులు అందాయి. వాటిని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్ ప‌రిశీలించి.. ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు కేటాయించారు.

క్యూర్ పరిధిలో

క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో 134 పిర్యాదులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 39 ఫిర్యాదులు వచ్చాయి. సీఎంసీ ప్రజావాణిలో మొత్తం 66 ఫిర్యాదులు అందాయి. వీటిలో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 51, ఇంజినీరింగ్‌కు 8, శానిటేషన్‌కు 2, అర్బన్ బయోడైవర్సిటీకి 2, ఎలక్ట్రికల్, రెవెన్యూ (ప్రాపర్టీ ట్యాక్స్), ఎన్నికల విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదులు అందాయి. ప్రతి వినతిని సమీక్షించి, సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఎంఎంసీలో 29 ఫిర్యాదులు వచ్చాయి. తార్నాకలోని ప్రధాన కార్యాలయంలో కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు.

Next Story