Satya Nadella: ఏఐతో పాటు కంపెనీ అసలైన సంపద కూడా బయటకు వెళ్లే ప్రమాదం

by S Gopi |

అత్యంత విలువైన సంస్థాగత జ్ఞానసంపదను కూడా అనుకోకుండా ఏఐ కంపెనీలకు అందించే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హెచ్చరించారు.

Satya Nadella: ఏఐతో పాటు కంపెనీ అసలైన సంపద కూడా బయటకు వెళ్లే ప్రమాదం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వేగంగా స్వీకరిస్తున్న సంస్థలు, దాని ద్వారా లాభాలు పొందడంతో పాటు తమ అత్యంత విలువైన సంస్థాగత జ్ఞానసంపదను కూడా అనుకోకుండా ఏఐ కంపెనీలకు అందించే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హెచ్చరించారు. దీన్నే ఆయన 'రివర్స్ ఇన్ఫర్మేషన్ పారడాక్స్' గా అభివర్ణించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పోస్టు చేసిన నాదెళ్ల, ఏఐ యుగంలో కంపెనీలు మేధస్సు కోసం ఒకసారి డబ్బుతో, రెండోసారి తమ సొంత పరిజ్ఞానంతో రెండుసార్లు చెల్లిస్తున్నాయని అన్నారు. ఏఇ నుంచి మెరుగైన ఫలితాలు కావాలంటే సంస్థలు ఎక్కువ సమాచారం, డేటా, పని విధానాలు, అనుభవాలను ప్రాంప్ట్‌ల రూపంలో పంచుకోవాల్సి వస్తోంది. దీంతో ఏఐ మోడళ్లు సంస్థల పని తీరును, నిర్ణయాలను, నైపుణ్యాన్ని క్రమంగా నేర్చుకుంటాయని ఆయన చెప్పారు. నోబెల్ గ్రహీత కెన్నెత్ ఆరో ప్రతిపాదించిన 'ఇన్ఫర్మేషన్ పారడాక్స్'ను ప్రస్తావించిన నాదెళ్ల, ఏఐ దానికి పూర్తి విరుద్ధమైన పరిస్థితిని తీసుకొచ్చిందని అన్నారు.

ఇది కేవలం డేటా ప్రైవసీ సమస్య కాదు. ఉద్యోగులు చేసే ప్రతి ప్రాంప్ట్, ప్రతి సవరణ, ప్రతి మూల్యాంకనం ఏఐకి సంస్థలోని అనుభవం, నైపుణ్యం, నిర్ణయ సామర్థ్యాన్ని నేర్పిస్తుంది. కాలక్రమేణా ఏఐ సేవలందించే సంస్థలకు వినియోగదారుల గురించి మరింత సమాచారం చేరుతుంటే, తమ జ్ఞానం ఎలా ఉపయోగిస్తున్నారనే విషయం కస్టమర్లకు స్పష్టంగా తెలియదు. ఇదే కొనసాగితే ఏఐ ద్వారా సృష్టించే ఆర్థిక విలువలో పెద్ద భాగం ఏఐ మౌలిక సదుపాయాల యజమానులకే దక్కే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దీనికి పరిష్కారంగా సంస్థలు తమ డేటా, సంస్థాగత జ్ఞానంపై పూర్తి నియంత్రణను కొనసాగించడం, ప్రైవేట్ ఏఐ లెర్నింగ్ వాతావరణాలను ఏర్పాటు చేయడం, ఒకే ఏఐ మోడల్‌పై ఆధారపడకుండా ఉండడం, ఫ్లెక్సిబుల్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగించడం, అలాగే ప్రతి వినియోగంతో సంస్థకే విలువ పెరిగేలా నిరంతర లెర్నింగ్ వ్యవస్థను రూపొందించుకోవాలని నాదెళ్ల సూచించారు.

Next Story