- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడి ముందు దోపిడీ.. "బాలాజీ"కి పట్టదా..?
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ చిలుకూరు బాలాజీ ఆలయానికి ప్రతి రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.

దిశ, మొయినాబాద్ : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ చిలుకూరు బాలాజీ ఆలయానికి ప్రతి రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే స్వామివారి దర్శనం కంటే ముందే గుడి వెలుపల భక్తులు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. పార్కింగ్ ఫీజుల నుంచి పూజా సామగ్రి విక్రయాల వరకు ఒకే విధమైన ధరలు అమలు చేస్తూ, కొబ్బరికాయ కొనాలంటే తప్పనిసరిగా తులసిమాల, పూలు కూడా కొనాలనే షరతులు విధిస్తున్నారని భక్తులు వాపోతున్నారు. "ఇక్కడ ఇంతే... కొనాలంటే కొనండి, లేదంటే వద్దు" అనే సమాధానమే వ్యాపారుల నుంచి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆలయం బయట పూజా సామగ్రి విక్రయించే వ్యాపారులు ఒకే సిండికేట్‌గా వ్యవహరిస్తున్నారని, ధరలను ఒకే వ్యక్తి నిర్ణయిస్తున్నాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చిన్న వ్యాపారులకు అప్పుగా సరుకులు ఇచ్చి వారిని తన ఆధీనంలో ఉంచుకుంటూ, ఒకే ధర విధానాన్ని అమలు చేయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో భక్తులకు ప్రత్యామ్నాయం లేక అధిక ధరలకు వస్తువులు కొనాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆలయ పరిసరాల్లో తగిన మరుగుదొడ్లు, ఇతర కనీస సౌకర్యాలు లేకపోవడం కూడా భక్తులకు ఇబ్బందిగా మారిందని వారు అంటున్నారు.
పార్కింగ్ నిర్వహణలోనూ పారదర్శకత లోపిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ద్విచక్ర వాహనాలకు రూ.20, కార్లకు రూ.40 వసూలు చేస్తున్నప్పటికీ, ఇచ్చే పార్కింగ్ టికెట్లపై వాహన నంబర్లు నమోదు చేయడం లేదని భక్తులు పేర్కొంటున్నారు. వాహనం బయటకు వెళ్లిన తర్వాత అదే టికెట్లను మళ్లీ వినియోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలగకుండా, గుడి వెలుపల జరుగుతున్న ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, పార్కింగ్ వ్యవస్థ, పూజా సామగ్రి ధరలపై నియంత్రణ తీసుకురావాలని, భక్తులకు పారదర్శకమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.






