జిల్లాల పునర్విభజనకు ప్రెసిడెంట్ పర్మీషన్ మస్ట్.. ప్రభుత్వ వర్గాల్లో హాట్‌హాట్‌గా డిస్కషన్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-14 01:37:54  IST  )

జిల్లాల పునర్విభజనకు రాష్ట్రపతి ఆమోద ముద్ర తప్పనిసరి. లేకపోతే ఆ జిల్లాలు కేవలం రెవెన్యూ పరంగానే గుర్తింపు ఉంటుంది కాని, ఉద్యోగాల భర్తీకి,ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీలకు అవకాశం ఉండదని సీనియర్ ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

జిల్లాల పునర్విభజనకు ప్రెసిడెంట్ పర్మీషన్ మస్ట్.. ప్రభుత్వ వర్గాల్లో హాట్‌హాట్‌గా డిస్కషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జిల్లాల పునర్విభజనకు రాష్ట్రపతి ఆమోద ముద్ర తప్పనిసరి. లేకపోతే ఆ జిల్లాలు కేవలం రెవెన్యూ పరంగానే గుర్తింపు ఉంటుంది కాని, ఉద్యోగాల భర్తీకి,ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీలకు అవకాశం ఉండదని సీనియర్ ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్రం సఫోర్టు చేస్తే కొత్త జిల్లాలకు చకాచకా క్లియరెన్స్ లభిస్తుందని,లేకపోతే మాత్రం నెలల కొద్దీ పెండింగ్ లో పెట్టే చాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో రెండు సార్లు జిల్లాల విభజన ప్రక్రియ జరిగింది. మొదటిసారి 31 జిల్లాలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించేందుకు ఏడాదిన్నర సమయం తీసుకున్నారని, ఆ తరువాత అదనంగా రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తూ పంపిన పైల్ కేవలం నెల రోజులకే క్లియరెన్స్ లభించిందని గుర్తు చేస్తున్నారు.

జోనల్ పరిధిలోపే కష్టం

ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను 7 జోన్లుగా, 2 మల్టీజోన్లుగా విభజిస్తూ రాష్ట్రపతి ఉత్త ర్వులు జారీ చేశారు. అయితే జిల్లాల పునర్విభజన ప్రక్రియ జోన్, మల్టీజోన్ పరిధిలోపే జరిగాలి. ఒకవేళ ఆ పరిధి దాటి కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తే, రాష్ట్రపతి ఉత్తర్వూలను సవరించాలి. అందుకోసం ప్రభుత్వం కేంద్ర హోం శాఖ ద్వారా రాష్ట్రపతి వద్దకు పైల్ పంపాలి. రాష్ట్రపతి వెంటనే ఆమోద ముద్ర వేస్తే సరి లేకపోతే నెలల కొద్దీ పైల్ పెండింగ్ లో పడుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ప్రస్తుతం ఉన్న జోనల్, మల్టీ జోనల్ పరిధి దాటి జిల్లాల పునర్విభజన జరిగితే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించడం కోసం కేంద్రానికి అప్పీలు చేయాలి. లేకపోతే న్యూ రిక్రూట్ మెంట్, ఉద్యోగుల బదిలీలు చేపట్టడం క ష్టం. ఈ ప్రక్రియ పూర్తవడానికి జిల్లాల పునర్విభజన తరువాత కనీసం 6 నెలల సమ యం పడుతుంది. కేంద్రంతో సన్నిహిత సం బంధాలు ఉంటే ఫైల్ పంపిన నెల రోజుల్లో గ్రీన్ సిగ్నల్ లభించవచ్చు. 2016లో 31 జి ల్లాలతో జరిగిన పునర్విభజనకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు దాదాపు ఎడాదిన్న ర సమయం తీసుకున్నారు. ఆదే 2020 లో అదనంగా రెండు జిల్లాలు (ములుగు, నారాయణపేట) ఏర్పాటు చేస్తే, మళ్లీ ఫైల్ పంపితే నెల రోజల్లో పైల్ క్లియర్ అయిందని బీఆ ర్ఎస్ హయాంలో జిల్లాల పునర్విభజనలో కీలక పాత్ర పోషించిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు.

ఖాళీల భర్తీ ఎలా.. ఉద్యోగుల విభజన ఎలా?

గత ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తరువాత ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో జిల్లాల పునర్విభజన అంశం ముందుకు రావడంతో ఎంప్లాయిస్ రిక్రూట్ మెంట్ ఉంటుందా? జిల్లాల పునర్విభజన వరకు పెండింగ్ లో పెడుతారా? అనే చర్చ జరుగుతున్నది. అయితే జిల్లాల పునర్విభజనకు కనీసం ఎడాది సమయం పట్టే చాన్స్ ఉంటుందని, ఈలోపు ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవనే వాదనలు సైతం ప్రభుత్వ వర్గాల్లో ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ హాయంలో జరిగిన జిల్లాల విభజన వల్ల జిల్లా ఉద్యోగులు తీవ్రంగా నష్టపొయ్యారు. వారంత అందోళన చేయడం వల్ల 317జీవో బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ సర్కారు కేబినెట్ సబ్ కమిటీ వేసి, ప్రత్యేకంగా పోస్టింగ్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ జిల్లాల పునర్విభజన చేస్తే ఉద్యోగుల విభజన మళ్లీ చేయాల్సి ఉంటుంది. దీనితో మళ్లీ తమ స్థానికత ఉన్న జిల్లాకు వెళ్లగలమా?మరో జిల్లాకు పంపిస్తారా?అనే చర్చ ఎంప్లాయిస్ లో నెలకొన్నది.

ఓ వైపు జనాభా లెక్కలు, మరోవైపు డీ లిమిటేషన్ అంశం

జనాభా లెక్కలు పూర్తయ్యే ఈ ఏడాది చివరి వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు మార్చొద్దని కేంద్రం ఆదేశించింది. మరి ఇలాంటి సమయంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపట్టడం కష్టమని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈలోపు ప్రజల అభిప్రాయాలు తీసుకుని, జనాభా లెక్కల ప్రక్రియ పూర్తయిన తరువాత జిల్లాల పునర్విభజన చేపట్టొచ్చని అభిప్రాయపడ్డారు. కాని అసెంబ్లీ, లోకసభ నియోజకవర్గాల పునర్విభజన సైతం ఒక అడ్డంకిగా మారే అవకాశం ఉందని అంటున్నారు. లోకసభ, అసెంబ్లీ స్థానాలు ప్రకటించిన తరువాత జిల్లాల పునర్విభజన చేపట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. లేకపోతే మాత్రం మళ్లీ ఒక్కో అసెంబ్లీ స్థానం రెండు మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లే ప్రమాదంఉంటుందని కామెంట్ చేస్తున్నారు.

Next Story