- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబార్షన్ కోసం వచ్చిన గర్భిణి మృతి..!
కడుపులోని శిశువుకు ప్రాణాపాయం ఉందని, తల్లి ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆసుపత్రికి వచ్చిన కుటుంబానికి విషాదం ఎదురైంది.

దిశ, మెదక్ ప్రతినిధి : కడుపులోని శిశువుకు ప్రాణాపాయం ఉందని, తల్లి ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆసుపత్రికి వచ్చిన కుటుంబానికి విషాదం ఎదురైంది. అటు శిశువుతో పాటు ఇటు గర్భిణి కూడా మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకుల కథనం మేరకు, కామారెడ్డి జిల్లా బస్వాపూర్‌కు చెందిన కొరెంకల మల్లేశం, అనిత (24) దంపతులకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడోసారి గర్భం దాల్చిన అనితకు కామారెడ్డిలో వైద్య పరీక్షలు నిర్వహించగా, గర్భంలో ఉన్న శిశువుకు గుండెలో రంధ్రం (హార్ట్‌లో హోల్) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో బిడ్డను కాపాడే అవకాశం లేదని, కనీసం తల్లి ప్రాణాలను రక్షించాలనే ఉద్దేశంతో భర్త మల్లేశం ఆమెను మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
అక్కడ కూడా పరీక్షలు నిర్వహించిన వైద్యులు శిశువు పరిస్థితిని నిర్ధారించి అబార్షన్ చేయాలని సూచించినట్లు కుటుంబీకులు తెలిపారు. దీంతో ఈ నెల 29న అనితను అబార్షన్ కోసం ఆసుపత్రిలో చేర్పించారు. అబార్షన్ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే గర్భంలోని శిశువు మృతి చెందినట్లు వారు తెలిపారు. అదే సమయంలో అనితకు తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించింది. దీంతో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం సూచన మేరకు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు కోరిన మేరకు డబ్బులు డిపాజిట్ చేయలేకపోవడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తున్న మార్గమధ్యలోనే అనిత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే అనిత మృతి..?
అనారోగ్యంతో ఉన్న శిశువుకు అబార్షన్ చేసి తల్లి ప్రాణాలు కాపాడాలని వచ్చిన కుటుంబానికి చివరికి తీరని విషాదం మిగిలింది. వైద్యం వికటించడం వల్లే అనితకు తీవ్ర రక్తస్రావం జరిగి ఆమె మృతి చెందిందని భర్త మల్లేశం ఆరోపించారు. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి బంధువులు కూడా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
మరోవైపు, ఈ ఘటనపై ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. గర్భంలోని శిశువు పరిస్థితి, చికిత్సకు సంబంధించిన అన్ని వివరాలను ముందుగానే కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. మృతురాలి కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా ఫిర్యాదు ఇవ్వలేదని, వారి ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని మెదక్ పట్టణ సీఐ మహేష్ తెలిపారు.






