సీతారామ పంప్‌హౌస్ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్

by Jakkula.Mamatha |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని సీతారామ సాగర్ పంప్‌హౌస్‌ను సందర్శించేందుకు వస్తున్న రాష్ట్ర మంత్రుల పర్యటనను నిరసిస్తూ అశ్వాపురం బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను ఇల్లెందు పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు.

సీతారామ పంప్‌హౌస్ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్
X

దిశ, ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని సీతారామ సాగర్ పంప్‌హౌస్‌ను సందర్శించేందుకు వస్తున్న రాష్ట్ర మంత్రుల పర్యటనను నిరసిస్తూ అశ్వాపురం బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను ఇల్లెందు పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు దిండిగాల రాజేందర్ నాయకత్వంలో అశ్వాపురానికి బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తుగా అడ్డుకొని అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. అరెస్టైన వారిలో టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్. రంగనాథ్, పట్టణ మాజీ అధ్యక్షుడు జబ్బార్ మొహమ్మద్, మండల మాజీ అధ్యక్షుడు శీలం రమేష్, పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, కో-ఆప్షన్ సభ్యుడు గాజీ, రాంలాల్ పాసి, సిలివెరి సత్యనారాయణ, రాజేశం, చాంద్ పాషా, హరిప్రసాద్, లక్ష్మీనారాయణ, నీలం రాజశేఖర్, సురేష్, రవికాంత్, బాలాజీ, సతీష్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో భద్రాద్రి జిల్లా రైతులకు సాగునీరు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టును చేపట్టి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు పరిధిలోని రైతులకు నీరు అందించకుండా, లింక్ కెనాల్ ద్వారా ఇతర ప్రాంతాలకు నీటిని మళ్లించడం వల్ల జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలైన రూ.2 లక్షల రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతులకు ఎరువులు, విత్తనాల సకాలంలో అందుబాటు, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు ముందుగా భద్రాద్రి జిల్లా ప్రజలకు సమాధానం చెప్పడంతో పాటు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

Next Story