వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.. రైతులకు మంత్రి సీతక్క సూచన

by Jakkula.Mamatha |

అడవులతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని ప్రతి ఒక్కరు అడవిని కాపాడుకొని సహజ సిద్ధమైన పండ్లు ఫలాలను తీసుకొని ఆరోగ్యకరంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు.

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.. రైతులకు మంత్రి సీతక్క సూచన
X

దిశ,ములుగు జిల్లా ప్రతినిధి: అడవులతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని ప్రతి ఒక్కరు అడవిని కాపాడుకొని సహజ సిద్ధమైన పండ్లు ఫలాలను తీసుకొని ఆరోగ్యకరంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. పాత కాలపు నాటి అలవాట్లు నేడు బంగారంతో సమానమని అన్నారు. గురువారం తాడ్వాయి మండలం గొనెపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ వో వికాస్ మీనా, ఐటీడీఏ పీవో నవీన్ వత్సల్ టొప్పోలతో కలిసి గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా మహిళాశక్తి జీవనోపాధుల కార్యక్రమంలో భాగంగా హంబుల్ బీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాలకు చెందిన మహిళలకు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పపువ్వు, సహజ సిద్ధమైన తేనె, మోదిగాకులు మానవ ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని, నేడు ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహారం తీసుకోవడం వలన క్యాన్సర్ బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మోదిగాకులో ఆహారం తీసుకోవడం వలన ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని, అడవులలో దొరికే పండ్లు, ఆకులు పలు రకాల వ్యాధులకు పని చేస్తాయని వివరించారు. మహిళా సంఘాలలోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వ వడ్డీ లేని పది లక్షల రూపాయల రుణాలను అందజేస్తుందని, రుణాలు పొందిన మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. గత కొద్ది నెలల క్రితం ఎస్ఎస్ తాడువాయి మండలం కొండపర్తి గ్రామంలో 50 వేల రూపాయలతో ఇప్పపువ్వు లడ్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా నేడు మహిళా సంఘాల సభ్యురాలు ఐదు లక్షల రూపాయల వరకు ఆదాయం పొందారని తెలిపారు.

నేడు తేనెటీగల పెంపకం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు హంబుల్ బీ సంస్థ ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వరి ధాన్యం కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని, కందులు, పెసర్లు, మొక్కజొన్న, తల్లి లాంటి పంటలు వేసుకోవాలని ఆయా పంటలకు రానున్న రోజుల్లో అధిక డిమాండ్ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, హంబుల్ బీ సంస్థ ప్రతినిధులు,స్వయం సహాయక సంఘాల మహిళలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Next Story