- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలు కాపాడేందుకు ఏం చేయాలో అది చేయండి.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం
నీట్ లీకేజీలపై 19 రోజులుగా దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ యూజీ2026 పేపర్ లీకేజీల వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాగుతున్న నిరసనల్లో భాగంగా ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారానికి 19వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుండటంతో ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) గురువారం ఉదయం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. వాంగ్‌చుక్ ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలను అందించాలని కోర్టు స్పష్టం చేసింది. 'ఈ దేశంలో ప్రతి పౌరుడి ప్రాణం ఎంతో విలువైంది. వాంగ్‌చుక్ ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని శక్తులూ ఒడ్డాలి' అని చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అలాగే అతని భద్రతను సైతం ప్రభుత్వమే చూసుకోవాలని ఆదేశించింది.
48 గంటల్లో ప్రాణాపాయం!
నిరాహార దీక్ష వల్ల 59 ఏళ్ల వాంగ్‌చుక్ ఇప్పటికే 8.5 కిలోల బరువు తగ్గారని, రాబోయే 48 గంటల్లో ఆయన దీక్ష విరమించకపోతే ప్రాణాలకే ప్రమాదమని పేర్కొంటూ బుధవారం కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పరిస్థితిపై ప్రభుత్వం తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. వాంగ్‌చుక్‌ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలతో కూడిన లిక్విడ్ డైట్‌ను బలవంతంగానైనా అందించాలని కోర్టును కోరారు.
ప్రభుత్వ వైద్యులతో ప్రతిరోజూ పరీక్షలు:
ఈ విచారణ సందర్భంగా వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన మెహతా ప్రతిరోజూ ఆయనకు హెల్త్ చెకప్స్ జరుగుతున్నాయని, అయితే కొన్నిసార్లు ప్రైవేట్ వైద్యులు కూడా చూస్తున్నారని కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ప్రైవేట్ వైద్యులు కాకుండా, ప్రతిరోజూ ప్రభుత్వ వైద్యులతోనే క్లినికల్ పరీక్షలు నిర్వహించాలని, ఆ నివేదికల ఆధారంగా అవసరమైన వైద్య సహాయం అందించాలని ఆదేశించింది.
వెనక్కి తగ్గేదే లేదు:
కోర్టు ఆదేశాలు వెలువడటానికి కొన్ని గంటల ముందు సోమ్ వాంగ్ చుక్ ఒక భావోద్వేగ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తికి ఉండే సాధారణ బలహీనత, కండరాల అలసట తనలో ఉన్నాయని, అయితే తన గుండె, అంతర్గత ఆరోగ్యం నిలకడగానే ఉన్నాయని చెప్పారు. అనేకమంది సీనియర్ రాజకీయ నాయకులు దీక్ష విరమించాలని కోరుతున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన రాకుండా వెనక్కి తగ్గితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన స్పష్టం చేశారు. దీక్ష విరమించమని నన్ను కోరడం కన్నా.. మీరంతా ఒక చిన్న అడుగు వేయండి. జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ (కాక్‌రోచ్ జనతా పార్టీ) నిర్వహించే నిరసనకు పెద్ద సంఖ్యలో తరలిరావాలంటూ పిలుపునిచ్చారు.






