- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజాసమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికే ప్రజాదర్బార్ : మంత్రి సీతక్క
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. శనివారం భూపాలపల్లి మండలం గుర్రంపేట రెవెన్యూ పరిధిలోని గుర్రంపేట, రామ్ నాయక్ తండా, పెద్దాపూర్, బావుసింగ్‌పల్లి, సుబ్బక్కపల్లి గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఐటిడిఎ పి.ఓ. లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలో ఇప్పటివరకు 70 గ్రామాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.
ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో సమీక్షించి నాలుగు రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ములుగు నియోజకవర్గంలో ఇప్పటికే లక్షకు పైగా పెన్షన్లు అందించామని, రాబోయే రోజుల్లో మరో రెండు నుంచి మూడు లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఐటీడీఎ ఆధ్వర్యంలో "అమ్మకు అక్షరమాల" కార్యక్రమం ద్వారా మహిళల్లో అక్షరాస్యత పెంపొందిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉండి మరణించిన మహిళల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా, రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఆసరాగా రూ.5 లక్షల బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. రామ్ నాయక్ తండా పేరు మార్పు అంశంపై గ్రామసభ తీర్మానం చేసి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పరిశీలించి 10 రోజుల్లో మంజూరు చేస్తామని, అవసరమైతే అదనపు ఇళ్లు కూడా మంజూరు చేస్తామని తెలిపారు. "ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండకూడదు" అనేది ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. ఒంటరి మహిళలు, వృద్ధులకు తొలి విడతలోనే పెన్షన్లు మంజూరు చేస్తామని, గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రైతులు, పేదలు, కార్మికులు, కర్షకుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అవసరమైన సూచనలు అందిస్తున్నారని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీవో హరికృష్ణ, స్థానిక తహసీల్దార్ లక్ష్మి రాజయ్య, ఎంపీడీవో తరుణ్ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.






