- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లల భవిష్యత్తుకు పోస్ట్ ఆఫీస్ భరోసా: రోజుకు రూ.6 తో రూ. లక్షల నిధి!
పిల్లల కోసం పోస్ట్ ఆఫీస్ 'బాల్ జీవన్ బీమా'! రోజుకు రూ. 6తో రూ. లక్షల పొదుపు. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్‌తో పిల్లల భవిష్యత్తుకు భరోసా.

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక అవసరాలు, అలవాట్లు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చు కంటే పొదుపు చేయడం ముఖ్యమైన పని. సోషల్ మీడియా, డిజిటల్ చెల్లింపుల ప్రభావం పెరిగిన తర్వాత ఎందుకు, ఎంత ఖర్చు చేస్తున్నామనే ఆర్థిక క్రమశిక్షణ చాలామందిలో తగ్గిపోయింది. ఎప్పుడు ఎలాంటి డబ్బు అవసరం ఏర్పడుతుందో తెలియని ఇలాంటి సమయంలో తప్పనిసరిగా కొంత దాచుకోవడం అవసరం. ముఖ్యంగా పిల్లలు ఉన్న వారైతే మరింత జాగ్రత్తగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పొదుపు చేయక తప్పదు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ చదువు, వారి ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి, పిల్లల భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకుని వివిధ పొదుపు పథకాలను తొలినాళ్లలోనే మొదలు పెట్టడం మంచిది. దానికోసం పోస్ట్ ఆఫీస్ సంస్థ అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం గురించి, అర్హతలు, ఇందులో ఎలా మదుపు చేయాలనే విషయాల గురించి తెలుసుకుందాం.
తల్లిదండ్రుల వయసుకు పరిమితి
పిల్లల భవిష్యత్తు భరోసా అందించే ఉద్దేశ్యంతో పోస్ట్ ఆఫీస్ ‘బాల్ జీవన్ బీమా పథకం’ అనే స్కీమ్ అందిస్తోంది. ఇందులో పొదుపు చేయడానికి కనీస మొత్తం రోజుకు రూ. 6, గరిష్టంగా రూ. 18 ఉంటుంది. ఈ పథకంలో చేరేందుకు పిల్లల వయసు 5-20 ఏళ్ల మధ్య ఉండాలి. పొదుపు కట్టే తల్లిదండ్రుల వయసు 45 ఏళ్ల దాటకూడదు. ఈ పథకం కొనుగోలు చేసినప్పుడు ఎంతకాలం ఎంచుకుంటారనే దానిపై ఆధారపడి పాలసీని 5 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య కాలానికి తీసుకోవచ్చు. ఇక ఈ పథకంలో పిల్లల పేరు మీద పొదుపు చేయడానికి సమీపంలోని పోస్ట్ ఆఫీసును సంప్రదించవచ్చు. సంబంధిత అధికారులను అడిగి బాల్ జీవన్ బీమా స్కీమ్పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అవసరమైన దరఖాస్తులో పిల్లల గురించి, పాలసీదారుడి వివరాలనూ పొందుపరచాలి. దరఖాస్తుదారుడి ఐడెంటిటీ, అడ్రస్‌కు సంబంధించిన జిరాక్స్ కాపీలను సమర్పించి అకౌంట్ఓపెన్ చేయాలి.
ప్రయోజనాలు
బాల్ జీవన్ బీమా పథకం కింద ఒక కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పథకంలో తక్కువ మొత్తం నుంచి ప్రారంభించాలంటే రోజుకు రూ. 6 చెల్లిస్తే సరిపోతుంది. మెచ్యూరిటీ సమయానికి కనీస హామీ కింద మొత్తం రూ. లక్ష పొందవచ్చు. గరిష్ట మొత్తంగా రోజుకు రూ. 18 కడితే, మెచ్యూరిటీ సమయానికి రూ.3 లక్షల వరకు తీసుకోవచ్చు. ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వారి పేర్ల కింద రోజుకు గరిష్ఠంగా రూ.36 పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ.6 లక్షల వరకు అందుకోవచ్చు. బోనస్ రేటు ప్రకారం ఈ పాలసీకి బోనస్ రూ. 1000కి రూ. 48 చెల్లిస్తారు. ఈ ప్రయోజనం సంవత్సరానికి ఒకసారి జమ అవుతుంది. ఒకవేళ పాలసీ గడువు పూర్తవకముందే పాలసీదారు మరణిస్తే, ఈ పాలసీ కింద భవిష్యత్తు ప్రీమియంలు మాఫీ అవుతాయి. మిగిలిన కాలానికి ప్రీమియం కట్టాల్సిన పనిలేదు. పాలసీ గడువు ముగిశాక పిల్లలకు మెచ్యూరిటీ మొత్తం అందిస్తారు. పాలసీ వ్యవధి లోపు పిల్లలు మరణిస్తే, డెత్ బెనిఫిట్స్ పాలసీదారునికి చెల్లిస్తారు. ప్రీమియం తల్లిదండ్రులు చెల్లించాలి. అయితే, ఈ పాలసీ ద్వారా లోన్ తీసుకునే సదుపాయం ఉండదు. అనుకోని సందర్భంలో ఈ పథకం వద్దనుకుంటే 5 ఏళ్ల తర్వాత సరెండర్ చేయవచ్చు.






