విద్యార్థుల ఉద్యమాన్ని పార్టీలు పక్కదోవ పట్టించాయి : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Batti.Sumithra |

విద్యార్థుల ఉద్యమాన్ని కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు పక్కదారి పట్టించాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

విద్యార్థుల ఉద్యమాన్ని పార్టీలు పక్కదోవ పట్టించాయి : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, వికారాబాద్ ప్రతినిధి: విద్యార్థుల ఉద్యమాన్ని కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు పక్కదారి పట్టించాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలను ఖండిస్తూ, నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌పై విద్యార్థి సంఘాలు ధర్నాలు చేయడం న్యాయమేనని అన్నారు. అయితే ఎలాంటి సంబంధం లేని కొన్ని రాజకీయ పార్టీలు అందులో చేరి విద్యార్థుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించాయని మండిపడ్డారు. దీనిని రాజకీయంగా వాడుకోవాలని దేశ విచ్ఛిన్నకర శక్తులతో కలిసి కొన్ని పార్టీల నాయకులు విద్యార్థుల ఉద్యమాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించాలని ప్రయత్నించారని పేర్కొన్నారు.

అయినప్పటికీ విద్యార్థుల ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి, విద్యాశాఖలోని ఉన్నతాధికారులను బదిలీ చేసి వారిపై చర్యలు తీసుకుందని అన్నారు. విద్యార్థి ఉద్యమ నాయకుల కోరిక మేరకు కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, విద్యార్థుల మనోభావాలను కాపాడడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మకు ఉరివేసి దహనం చేసే ప్రయత్నం చేస్తుండగా, అక్కడ ఉన్న బీజేపీ నాయకులు కొంతమంది వద్దని వారించగా, కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా కొట్టడం రౌడీయిజమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి రౌడీయిజం మంచిది కాదని, ఇలాంటి ఘటనలకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై అటెంప్ట్ టు మర్డర్ కేసుతో పాటు ఇతర కేసులు నమోదు చేసే వరకు ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వికారాబాద్ జిల్లా కోఆర్డినేటర్ కరణం ప్రహ్లాద్ రావు, మాజీ జిల్లా అధ్యక్షుడు కోకట్ మాధవ రెడ్డి, వడ్ల నందు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story